లక్ష్మీపూజలకు బదులు మోడీ పూజ

లక్ష్మీపూజలకు బదులు మోడీ పూజ

గుజరాత్‌లో మితివిూరిన అభిమానం

సూరత్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గుజరాత్‌లో అభిమానం విపరీతంగా మారింది. లక్ష్మీదేవికి బదులు మోడీ పూజలతో స్వామి భక్తి చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని దేవుడిగా పూజిస్తున్నారు గుజరాత్‌ ప్రజలు. ప్రతి ఏడాది దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవీకి పూజ చేసినట్లు ఈ ఏడాది మోదీ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గుజరాత్‌లో దీపావళి పండుగలో భాగంగా దంతేరాస్‌ వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేకంగా బంగారం, వెండి కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే ఈ ఏడాది సూరత్‌కు చెందిన ఓ బంగారం దుకాణ యజమాని.. గోల్డ్‌, సిల్వర్‌ బార్లపై మోదీ ప్రతిమలను అచ్చు వేయించాడు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా ఉండడంతో వందలాది మంది ఇప్పటికే కొనుగోలు చేశారు. దేశాభివృద్ధి, సంక్షేమం కోసం మోదీ నిరంతరం శ్రమిస్తున్నందుకు గుర్తుగా గోల్డ్‌ బార్లపై మోదీ ప్రతిమను అచ్చు వేయించినట్లు దుకాణ యజమాని చెప్పారు. బంగారంపై మోదీ ప్రతిమను అచ్చు వేయడం ఇదే మొదటిసారి కాదు. రాఖీ పండుగను పురస్కరించుకొని ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని ప్రతిమలను అచ్చు వేసిన విషయం విదితమే. ఈ రాఖీలను 22 క్యారెట్‌ బంగారంతో తయారు చేశారు.