లక్ష్యం లేని అవిశ్వాసం
అవిశ్వాసం లక్ష్యం తుస్సుమంది. ఎవరికి వారు తమ వాక్పటిమను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. మద్దతు దారులు బల్లలు చరిచారు. ఎద్దేవాలు..చురకలు వేసినప్పుడు ఆనందించారు. ఎదుటి వారిని ఎలా దుయ్యబట్టాలో నేర్చుకున్నారు. సూటిగా సమస్యలను ప్రస్తావించి వాటి వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్పడంలో ప్రధాన ప్రతిపక్షంతో పాటు అవిశ్వాసం పెట్టిన టిడిపి కూడా వైఫల్యం చెందింది. మోడీ చెప్పిన ఆదర్శాలు ఎలా ఎక్కడ వైఫల్యం చెందాయో చెప్పలేక పోయారు. ఆవేశంగా మాట్లాడడంతో అసలు విషయాలు పక్కన పోయాయి. అధికార పక్షాన్ని ఎండగట్టాలన్న ఏకైక లక్ష్యమే తప్ప దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలను ప్రస్తావించి వాటి విపరీత పరిణామాలను సభ ద్వారా వివరించలేక పోయారు. అందరూ తమ వాక్పటిమ ద్వారా ఎన్నికల ప్రసంగాచేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటును తమ ప్రచార వేదికగా ఉపయోగించుకున్నారు. మధ్యలో రాహుల్‌గాంధీ, మోదీల మధ్య మాటల యుద్ధం జరిగింది. కౌగిలింతలు, కన్నుకొట్టడాలు, ఒకరి చర్యలను మరొకరు ఎద్దేవా చేసుకోవడం కనిపించాయి. సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తుండటంతో ప్రతి పార్టీ ప్రత్యర్థులపై రాజకీయంగా పైచేయి సాధించాలని మాటల కత్తులు దూశాయి. ఇందులో విపక్షాల కన్నా ప్రధాని మోడీ ఓ అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ పాపాలను ప్రజలకు మరోమారు దుయ్యబట్టారు. నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం చేసినంత అభివృద్ధి 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేదని అధికారపక్షం ఎదురుదాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అడిగిన స్పష్టమైన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం దాటవేసింది. నాలుగేళ్లలో చెప్పిన మాటలనే పునరుద్ఘాటించి మమ అనిపించింది. పార్లమెంట్ అన్నది 120 కోట్ల ప్రజలకు వేదిక అన్నది మర్చి పోయారు. పరస్పర విమర్శలు చేసుకోవడంలో అటు ప్రధాని మోడీ, ఇటు రాహుల్‌గాంధీ తదితరులంతా సఫలమయ్యారనే చెప్పాలి. రెండు పర్యాయాలు చర్చ మధ్యలో సభ వాయిదాపడడం,33 మంది ప్రసంగాలు… ఆవేశకావేశాలు, ఎదురుదాడుల మధ్య సాగిన అవిశ్వాస తీర్మానం అద్యంతం రక్తి కట్టించింది. రాత్రి 11 తర్వాతే ఓటింగ్ జరిగింది. మొత్తం 451 మంది ఎంపీలు హాజరుకాగా తీర్మానానికి 325 మంది వ్యతిరేకంగా, 126 మంది అనుకూలంగా ఓటేశారు. దీంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించిన స్పీకర్ సుమిత్రామహాజన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఓటింగ్ జరిగినప్పుడు శివసేన, బీజేడీ, తెరాస సభ్యులు సభలో లేరు. అన్నాడీఎంకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ చెప్పారు. మొత్తంగా అవిశ్వాసం సందర్భంగా సాధించేదేవిూ ఉండదని అంతా అనుకున్నట్లే జరిగింది. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినా సర్కార్‌ను ఎండ గట్టామన్న తృప్టి విపక్షాల్లో కానవచ్చింది. సంఖ్యాబలంలో ప్రతిపక్షాలు వెనకబడ్డా వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఏకతాటిపైకి రాగలిగామోదీపై, ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. 12 గంటల పాటు జరిగిన చర్చకు చివరిలో ప్రధాని మోదీ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సమస్యలు, హావిూల అమలుపై ఏపీ, తెలంగాణ రెండూ సమర్థంగా తమ వాదనలు వినిపించాయి. ఎపికి అండగా ఉంటామన్న ప్రధాని స్పష్టంగా హావిూలు ఇవ్వలేకపోయారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత తొలిసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న మోదీ ప్రభుత్వం ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. గత బడ్జెట్ సమావేశాల్లోనే దీని ప్రస్తావన ఉన్నా ఎందుకనో అధికార పక్షం వెనక్కి పోయింది. తమిళనాడులో కావేరీ వివాదం, కర్నాటక ఎన్నికల కారణంగా అప్పట్లో దీనికి మొగ్గు చూపలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడి ¬దాలో సభలో తొలి ప్రసంగం చేసిన రాహుల్‌గాంధీ ప్రధాన
మంత్రిని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంత చేసినా ప్రధానిపై తనకేవిూ కోపం లేదంటూ నేరుగా ఆయన సీటు వద్దకు వెళ్లి కౌగిలించుకొని కలకలం రేపారు. ఒక ప్రతిపక్షపార్టీ నేత ప్రధానమంత్రి వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం పార్లమెంటు చరిత్రలోనే ప్రథమంగా కనిపించింది. చర్చ మొదలైన పది నిమిషాల్లోనే బీజేడీ వాకౌట్ చేసింది. చర్చలో పాల్గొన్న అనంతరం తెరాస బయటికి వెళ్లిపోయింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తామని ప్రకటించిన ఎన్డీయే మిత్రపక్షం శివసేన అసలు చర్చనుంచే దూరంగా ఉండిపోయింది. ఎన్డీయే మిత్రపక్షం స్వాభిమాన్ పక్ష నేత రాజూశెట్టి రైతులకోసం తాను అవిశ్వాసానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించి అధికారపక్షానికి షాక్ ఇచ్చారు. మొత్తం విూద అవిశ్వాస తీర్మాన ఘట్టం తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కలసి వచ్చింది. అయితే కాంగ్రెస్‌తో జతకట్టేందుకు సిద్దంగా ఉందన్న అపప్రథను కూడా మూటకట్టుకుంది. ఎన్టీఆర్ ఆశయాలకు భిన్నంగా టిడిపి కాంగ్రెస్‌కు చేరువ కావడం సగటు తెలుగు ప్రజలకు జీర్ణం కాని విషయం. ఎంపీల రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలను రాజకీయాస్త్రాలుగా తొలుతు తెరపైకి తెచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం కారణంగా పార్లమెంట్ రాజకీయాల్లో అదృశ్యం కాక తప్పలేదు. ఈ మొత్తం పరిణామాలలో ఆ పార్టీ అప్రధానమైనదిగా మిగిలిపోయింది. నాలుగేళ్ల పాటు ఎన్‌డిఎ భాగస్వామిగా ఉన్నప్పటికీ, సమస్యల విషయంలో రాజీపడకుండా బయటకు వచ్చిందన్న ఏకైక లబ్దిని టిడిపి పొంది ఉన్నా, అవిశ్వాసం వల్ల సాధించేందేవిూ లేదు. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదకగా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌కు చేరువయ్యింది. విభజనకు సంబంధించి కాంగ్రెస్‌ను ఎండగట్టడంలో వైఫ్యలం కూడా చెందింది. మొత్తంగా రాజకీయ ప్రసంగాలకు లోక్‌సభలో అవిశ్వాసం ఓ అంశంగా మారిందనడంలో సందేహం లేదు.