లక్ష ఉద్యోగాల హావిూని విస్మరించిన కెసిఆర్: సిపిఐ
ఆదిలాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా లక్ష ఉద్యోగాల ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని సిపిఐ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. టిఆర్ఎస్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా హావిూలను నెరవేర్చలేదని ఆరోపించారు. సమర్ధులైన యువ అధికారులు ఉన్నప్పుడే ప్రజాభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు వేగవంతంగా, సమర్ధంగా అమలవుతాయన్నారు. ప్రభుత్వ శాఖలు, జూనియర్, డిగ్రీ, ఏయిడెడ్, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వేలాది ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అందించాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. అన్నింటా ఏకపక్ష నిర్ణయాలే తీసుకోవడం కెసిఆర్‌కే చెల్లిందని అన్నారు. విమర్శలు వస్తున్నా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని అన్నారు. విమర్శలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సిఎం కెసిఆర్‌పై ఉందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని అన్నారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నాయకుడు ఆరోపించారు. ఉప్పులు, పప్పులు, నూనె, కూరగాయల ధరలు మండిపోతున్నాయని, ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. అధిక ధరలను నిరసిస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, ఎఫ్‌డీఐలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ధరలను నియంత్రిస్తామని గ్దదెనెక్కిన ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు.