లక్ష మందితో రాజధానిని దిగ్బంధిస్తం
తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేస్తం
పాలకుల గుండెల్లో దడ పుట్టిస్తం
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తం :కోదండరాం
హైదరాబాద్, ఆగస్టు 29 (జనంసాక్షి): సెప్టెంబర్ 30న తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌లో లక్ష మందితో హైదరా బాద్ నగరాన్ని దిగ్బంధించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటుతామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. టీఎన్‌జీఓ కేంద్ర కమిటీ అసోసియేట్ అధ్యక్షురాలు రంజన ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి లోని టీఎన్‌జీఓల ప్రధాన కార్యాలయంలో ఆమె గౌరవార్థం నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ మార్చ్ రూపురేఖలను వివరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కచ్చితంగా తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేస్తామని, దీనికి తెలంగాణలోని అన్ని వర్గాలు మద్దతునిస్తున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్ నిర్వహణతో సీమాంధ్ర పాలకుల గుండెల్లో దడ పుట్టించి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పూనుకునేలా ఒత్తిడి చేస్తామని ఆయన తెలిపారు. ఏదేమైనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని కోదండరాం పునరుద్ఘాటించారు. తెలంగాణలో ఉన్న ఉద్యోగ, కార్మిక, కర్షక, వ్యాపార, వాణిజ్య వర్గాల వారందరూ సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు తరలిరావాలని, తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. అనంతరం టీఎన్‌జీఓల అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ దశాబ్దన్నర కాలంగా ప్రజా ఉద్యమాల్లో మహిళల పాత్ర పెరిగిందన్నారు. దీనికి తెలంగాణ సాధనోద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమాలు దోహదం చేశాయని తెలిపారు. మహిళలు ఇంట్లో, ఆఫీసుల్లో పని ఒత్తిడులను అధిగమించి ఉద్యమాల్లో పాలుపంచుకోవడం అభినందించదగ్గ పరిణామమని దేవీప్రసాద్ కొనియాడారు. సన్మాన గ్రహీత రంజన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా సాగడమే కాకుండా, ఉద్యమాల ఆవశ్యకతపై మహిళల్లో అవగాహన పెంచడంలో చేస్తున్న కృషి ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, టీజీఓ నేతలు విఠల్, శ్రీనివాస్‌గౌడ్ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.