లగడపాటి సర్వే కరెక్ట్‌ కాదు

– టీడీపీకి 130 స్థానాలకు పైగానే వస్తాయి
– టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
అమరావతి, మే20(జ‌నంసాక్షి) : లగడపాటి రాజగోపాల్‌ టీడీపీకి 110 వరకు స్థానాలు వస్తాయని తన సర్వేద్వారా వెల్లడించారని, ఆ సర్వే తప్పని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. లగడపాటి చెప్పినట్లు టీడీపీకి 110 కాదని, 130 స్థానాల్లోపైగా టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీకి వత్తాసు పలికే చానళ్లే.. జగన్‌కూ వత్తాసు పలుకుతున్నాయని బుద్దా వెంకన్న ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్‌ సర్వే కరెక్ట్‌ కాదని.. తమకు 130 సీట్లు వస్తున్నాయని అందులో ఎలాంటి అనుమానమూ లేదన్నారు. వైసీపీ ఓడిపోతుందని జగన్‌కు కూడా తెలుసని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. లగడపాటి అంచనాలను మించి తమకు సీట్లు వస్తాయన్నారు. సర్వేలు చాలా చోట్ల అంచనాలు తప్పుతున్నాయని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఎన్డీఏకి బాగా తక్కువ సీట్లు వస్తున్నాయన్నారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌లో కావాలని మోదీ హైప్‌ చేయించారని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే లు మోదీ ఆదేశాల మేరకే అలా చెప్పాయన్నారు. అధికారంలోకి వస్తున్నామని వైసీపీ మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. మహిళలంతా టీడీపీకే ఓట్లు వేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా వైకాపా నేతలు ఇంతకంటే ఎక్కువే ఊహల్లో తేలారని గుర్తుచేశారు. అప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌కి భిన్నంగా రాష్ట్రంలో ఫలితం వచ్చిందని ఆయన గుర్తుచేశారని, వైకాపా ఓడిపోతుందని జగన్‌కు కూడా తెలుసన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై తెలుగుదేశం శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. తెదేపా గెలుపు ఖాయమని వివరించారు. జగన్‌తో కలిసి మోదీ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని దుయ్యబట్టారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబే ప్రమాణం చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తారని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.