లగడపాటి సొల్లు కూతలకు నిరసన
ఇంటి ముందు తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ధర్నా
కోడిగుడ్లతో దాడి
హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి) :
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సొల్లు కూతలు కూస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలు రోజుకోరకంగా దెబ్బతీస్తున్నాడని ఆయన నివాసం ఎదుట తెలంగాణ లాయర్లు ఘాటుగా నిరసన తెలిపారు. మెడికల్ సీట్ల విషయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ న్యాయవాదులు ఆరోపించారు. ఆదివారం మూకుమ్మడిగా జూబ్లీహిల్స్‌లోని లగడపాటి నివాసం వద్దకు చేరుకున్నారు. ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. లగడపాటిని సోనియాగాంధీ ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిందా, యూపీఏ ప్రభుత్వం జీపీఏ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ తెలంగాణపై అసత్యాలు మాట్లాడుతున్న లగడపాటి తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే హైదరాబాద్‌లో తిరగనివ్వమని, ల్యాంకో హిల్స్‌ను కూకటి వేళ్లతో పీకేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ, వక్ఫ్ భూములను కొల్లగొట్టి సత్యవాదిలా మాట్లాడుతుండడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నదని హేళన చేశారు. కోటాను కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన బెజవాడ ఎంపీ తన ఆస్తులను అమ్మి ఇక్కడి ప్రజలకు జరిమానా కట్టాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి తెలంగాణపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. లాయర్ల నినాదాలతో జూబ్లీహిల్స్ ప్రాంతం మార్మోగింది. ఒక దశలో తీవ్ర ఆగ్రహానికి గురైన లాయర్లు లగడపాటి ఇంటిలోకి కోడి గుడ్లు, రాళ్లు విసిరి దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, లాయర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు తెలంగాణ లాయర్లను అదుపులోకి తీసుకున్నారు.