లగ్జరీ కార్లపై కేంద్రం సెస్‌

15 నుంచి 25 శాతానికి పెంపు

న్యూఢిల్లీ,ఆగస్టు30  : లగ్జరీ కార్లు, స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిళ్లపై కేంద్ర ప్రభుత్వం సెస్‌ను పెంచింది. గతంలో 15 శాతం ఉన్న సెస్‌ను ఇప్పుడు 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్‌ ఇచ్చిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెస్‌ శాతాన్ని పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై సెస్‌ శాతాన్ని పెంచాలని ఆగస్టు 5న సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ కౌన్సిల్‌ ఆగస్ట్‌ 5న జరిగిన సమావేశంలో ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లపై సెస్‌ను భారీగా పెంచేందుకు పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం 15 శాతం ఉన్న సెస్‌ను 25 శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ కౌన్సిల్‌ అధికారం కట్టబెట్టినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. జీఎస్టీ అమలు తర్వాత మోటార్‌ వెహికిల్స్‌పై వచ్చే పన్ను భారీగా తగ్గింది. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ తమ 20వ సమావేశంలో చర్చించింది. దీంతో వెహికిల్స్‌పై గరిష్ఠ సెస్‌ను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచేలా చట్ట సవరణలు చేసుకోవచ్చని ప్రభుత్వానికి కౌన్సిల్‌ సూచించింది.