లలిత్ మోడీకి సుష్మా సాయం
ఢిల్లీ జూన్ 14 (జనంసాక్షి):
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. లలిత్ మోడీకి సహకారంపై సుష్మా స్వరాజ్ పై రాజకీయంగా దుమారం రేగుతోంది. రెడ్ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి కేంద్రమంత్రి ఎలా సహాయం చేస్తారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. సుష్మా స్వరాజ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి వీసా జారీ కోసం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సిఫార్సు చేయడంపై వివాదం రాజుకుంది. బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు లలిత్ మోడీకి సుష్మాస్వరాజ్ సహాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోపణలపై ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన సుష్మా..
లలిత్ మోడీకి వీసా సహకారంపై సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో స్పందించారు. లలిత్ భార్య కాన్సర్‌తో బాధపడుతోందని మానవతా దృక్పథంతోనే ఆమె చికిత్స కోసం సహకరించినట్లు వివరణ ఇచ్చారు. ఇక ఇదే విషయమై ప్రధాని మోడీతో సుష్మాస్వరాజ్ ఫోన్ లో మాట్లాడారు. లలిత్ మోడీకి వీసా సహకారంపై విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణపై ప్రధానికి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
లలిత్‌కు అనుమతి ఇవ్వాలని సుష్మా సిఫారసు..
ఇక సుష్మాస్వరాజ్ వివాదం వివరాల్లోకి వెళితే..జూలై 2014లో లలిత్ మోడీ తన భార్య కాన్సర్ చికిత్సకోసం పోర్చుగల్ వెళ్లేందుకు యూకే ప్రభుత్వానికి సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేశారు. అయితే అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ కు అనుమతి ఇస్తే భారత్ యూకే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని యూకే స్పందించలేదు. కాగా ఇదే విషయమై లలిత్ మోడీ సుష్మా స్వరాజ్ ను సంప్రదించారు. యూకే అధికారులతో మాట్లాడి తనకు పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతి ఇప్పించాలని సుష్మాను కోరారు.
వీసా జారీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు…
లలిత్ మోడీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సుష్మాస్వరాజ్, బ్రిటిష్ హై కమిషనర్ ను సంప్రదించారు. లలిత్‌కు వీసా జారీ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. మరోవైపు లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు కీత్ వాజ్ అనే భారత సంతతికి చెందిన బ్రిటన్ పార్లమెంటు సభ్యుడిపై ఒత్తిడి తెచ్చిమరీ సుష్మా వీసా జారీ చేయించారనే కథనాలు వినిపిస్తున్నాయి.
లలిత్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు..
అక్రమాస్తుల కేసులో ఈడీ నోటీసులు అందుకున్న లలిత్ మోడీ 2010 నుంచి యూకేలో ఉంటున్నారు. ఐపీఎల్‌లో బెట్టింగ్ ఆరోపణలు కూడా లలిత్ మోడీపై ఉన్నాయి. కాగా లలిత్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి ఎలా సహకరిస్తారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. సుష్మా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. మరోవైపు ప్రధాని మోడీ ఈ ఆరోపణలపై తక్షణమే వివరణ ఇవ్వాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ డిమాండ్‌చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన లలిత్ మోడీ వీసా విషయం మోడీ సర్కారును ఇబ్బందులకు గురిచేసేదిగా మారింది. మరి దీనిపై అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.