లష్కర్‌ బోనాలు షురూ

C

– భారీ భద్రతో సీసీ కెమెరాల ఏర్పాటు

– సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,జులై 23(జనంసాక్షి): ఆదిసోమవారాల్లో రెండు రోజులపాటు జరిగే లష్కర బోనాలకు సర్వం సిద్దం అయ్యింది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్‌ పరిసరాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉజ్జయిని అమ్మవారి ఆలయం శోభాయమానంగా రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలరారుతోంది. ఇక ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు మహిళా భక్తులు ప్రశాంతంగా బోనాలు సమర్పించుకునేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్యూలైన్లు పూర్తయ్యాయి. భక్తులతోపాటు సికింద్రాబాద్‌ వాసులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని సిసి కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకుని వచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆషాఢ బోనాల జాతర మ¬త్సవాలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ముస్తాబయ్యింతోంది.తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర పండగగా జరుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బల్దియా కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, నగర పోలీస్‌ కమిషన్‌ మహేందర్‌ రెడ్డిలు ఆలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

మౌలిక సదుపాయాల కల్పన కోసం తొలి విడతలో రూ.1.35 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. రోడ్ల మరమ్మతులు, మూత్రశాలల నిర్మాణం, వీధి దీపాలు, డ్రైనేజీ మ్యాన్‌¬ల్స్‌ మరమ్మతులు తదితర సదుపాయాలను మెరుగు పరిచారు శనివారం ఉదయానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల నిర్వహణలో బల్దియా ప్రధాన భూమిక పోషిస్తోంది. సుమారు రూ.60 లక్షలు వెచ్చించి ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తయ్యాయి. లష్కర్‌లోని ప్రధాన రహదారులు ఎంజీరోడ్డు, ఆర్పీరోడ్డు ప్రాంతాల్లో డివైడర్లకు, ఫుట్‌పాత్‌లకు రంగులు వేశారు. ఇదిలావుంటే ఈ నెల 24న బోనాల పండుగ సందర్భంగా సైబరాబాద్‌ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ మహేశ్‌ భవగవత్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపోతే మహంకాళి బోనాల జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 3వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేసేందుకు అన్ని శాఖలకు ఇదివరకే అనుమతులిచ్చామన్నారు. గత ఏడాదికంటే ఈసారి మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం పట్టే బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. బోనాల జాతరకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, నాయిని నరసింహారెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.  సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల జాతర బందోబస్తులో భాగంగా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆది, సోమవారాల్లో జరగనున్న జాతరకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో  అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని అన్నారు. తొక్కిసలాట లేకుండా ఉండేందుకు క్యూలైన్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణం, జాతర ఊరేగింపు, భక్తులు ఎక్కువగా సంచరించే మార్గాల్లో వందకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళ భక్తుల భద్రత కోసం గొలుసుచోరీ నిరోధక బృందాలు, షీ బృందాలను నియమిస్తున్నట్లు వెల్లడించారు.  బోనాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇతర శాఖలతో పోలీసుశాఖ సమన్వయంతో పనిచేస్తుందన్నారు. బోనాల వూరేగింపు మార్గాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని వర్గాలు పోలీసులకు సహకరించి బోనాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని కమిషనర్‌ కోరారు.