లాఠీలతో మా గొంతు నొక్కలేరు

C

– సామాజిక న్యాయం కోసం పోరాడుతాం

– రోహిత్‌ చట్టం రావాలి

– జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌

– గేటు వద్దే కన్హయ్యను అడ్డుకున్న భద్రతా సిబ్బంది

హైదరాబాద్‌,మార్చి23(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల వేదన వినే పరిస్థితిలో లేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ ఆరోపించారు. దేశంలో సామాజిక న్యాయం కలగానే మిగులుతోందన్నారు. రోహిత్‌ వేముల తల్లి రాధికతో కలిసి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చిన కన్నయ్య కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కన్నయ్యకుమార్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లాఠీలతో కొట్టినా.. ఆస్పత్రుల్లో చేర్పించినా తమ గొంతును ఎవరూ నొక్కలేరన్నారు. సామాజిక న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌ వేముల కలలను సాకారం చేయాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. రోహిత్‌ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  అంతకు ముందుహైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ మరోసారి విద్యార్థులు ఆందోళనలతో మార్మోగింది. రోహిత్‌ తల్లికి మద్దతు తెలిపేందుకు జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య హెచ్‌సీయూకు రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒకవైపు పోలీసుల లాఠీలు..మరోవైపు విద్యార్థులు నినాదాలతో యూనివర్శిటీ ప్రాంగణం అట్టుడికిపోయింది. యూనివర్శిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదని వర్శిటి సెక్యూరిటీ సిబ్బంది తేల్చిచెప్పడంతో బహిరంగసభకు కన్హయ్య హాజరుకాలేదు. లాఠీలు, తూటాలతో తమ పోరాటాన్ని ఆపలేరని,.అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఆశయసాధనకు నిరంతరం పోరాడుతామని కన్హయ్య స్పష్టం చేశారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య హైదరాబాద్‌ టూర్‌ ఊహించినట్లుగానే ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కన్హయ్యకు విద్యార్థి సంఘాలనేతలు స్వాగతం పలికారు. కన్హయ్య రాకతో ఎయిర్‌పోర్టులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కన్హయ్య శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఆర్‌ ఫౌండేషన్‌ భవన్‌కు చేరుకున్నారు. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌ వేముల తల్లి రాధిక, సోదరుడును కన్నయ్యకుమార్‌ పరామర్శించారు. రోహిత్‌ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో పాల్గొన్న కన్హయ్య..రోహిత్‌ ఆత్మహత్యకు యూనివర్శిటీ వీసీ అప్పారావే కారణమని ఆరోపించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీకి కన్హయ్య చేరుకున్నారు. అయితే కన్హయ్య హెచ్‌సీయూకు వస్తున్నారన్న సమాచారంతో వర్శిటీ వద్ద భారీ ఎత్తున కేంద్ర పోలీసు బలగాలు మోహరించాయి. హెచ్‌సీయూకు కన్హయ్యతో పాటు రోహిత్‌ తల్లి రాధిక, సోదరుడు కూడా ఉన్నారు. హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద కన్హయ్య కుమార్‌ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కన్నయ్యకు హెచ్‌సీయూలోకి ప్రవేశం లేదని వీసీ అప్పారావు సర్క్యులేషన్‌ జారీచేసిన నేపథ్యంలో పోలీసులు, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విద్యార్థిని పరామర్శించిన కన్హయ్య..

లాఠీలు, తూటాలతో తమ పోరాటాన్ని ఆపలేరని,..అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఆశయసాధనకు పోరాడుతామని కన్హయ్య స్పష్టం చేశారు. వీసీని తొలగించి… రోహిత్‌ చట్టం తెచ్చే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. కన్హయ్యను వర్శిటీలోపలికి అనుమతించకపోవడంపై సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. అయితే వర్శిటీ లోపలికి వెళ్లేందుకు కన్హయ్య ఎంత ప్రయత్నించినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుచెప్పడంతో చివరకు కన్హయ్య వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం పోలీసుల లాఠీచార్జ్‌ లో గాయపడి మధినాగూడలోని ప్రణవ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధి ఉదయ్‌ను పరామర్శించారు.

చదువుకొనే వాతావరణం లేదు

విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాతావరణం కనిపించడం లేదని జేఎన్‌ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య పేర్కొన్నారు. హెచ్‌ సీయూలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ చర్యలే రోహిత్‌ మరణానికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను కూడా కేంద్రం అమలు చేయడం లేదన్నారు. రోహిత్‌ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకే క్యాంపస్‌కు వెళ్తున్నట్టు కన్హయ్య తెలిపారు. వర్సిటీల్లో చదువుకొనే వాతావరణం కల్పించే ప్రయత్నం చేయాలని కోరారు. రోహిత్‌ యాక్టు అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రావడానికి అనుమతి లేదని వీసీ పేర్కొంటున్నట్లు తెలుస్తోందని, కానీ వర్సిటీకి వచ్చేందుకు వీసీకే అనుమతి లేదన్నారు.

కన్నయ్యకు సిపిఐ, విద్యార్థి నేతల స్వాగతం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కన్నయ్యకు పలువురు విద్యార్థులు, సీపీఐ కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే హెచ్‌సీయూకు వెళ్తున్నట్లు కన్నయ్య తెలిపారు. రోహిత్‌ వేముల తల్లిని పరామర్శిస్తామన్నారు. రోహిత్‌ తల్లిని పరామర్శించి మద్దతు తెలిపేందుకు వచ్చానన్నారు. సాయంత్రం హెచ్‌ సీయూకి వెళ్తానని, రోహిత్‌ చట్టం వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తానని కన్హయ్య పేర్కొన్నారు. మరోవైపు కన్నయ్య కుమార్‌ రాక నేపథ్యంలో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వర్శిటీ అధికారులు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. యూనివర్శిటీకి వెళ్లే గేట్లను మూసివేశారు. ప్రధాన ద్వారం దగ్గర పోలీసులు మోహరించారు. అలాగే వర్శిటీలో తాగునీరు విద్యుత్‌ కట్‌ చేశారు. విూడియాకు అనుమతి నిరాకరించారు. అటు కన్నయ్య రాకను ఏబీవీపీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు యూనివర్శిటీలో కన్నయ్య కుమార్‌ సభా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సీపీఐ నేత అజీజ్‌ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ వీహెచ్‌ను కూడా అడ్డుకున్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే హెచ్‌సీయూకు వెళ్తున్నట్లు కన్నయ్య తెలిపారు. యూనివర్శిటీకి వెళ్లే గేట్లను మూసివేశారు. ప్రధాన ద్వారం దగ్గర పోలీసులు మోహరించారు.  తాను ముందుగా రోహిత్‌ తల్లిని, అతడి  సోదరుడిని కలుస్తానని, సాయంత్రం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో బహిరంగ సభకు హాజరై అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తానని శంషాబాద్‌ విమానాశ్రయంలో విూడియాతో మాట్లాడుతూ కన్హయ్య చెప్పాడు. పోలీసులు అనుమతిస్తారనే నమ్మకం తనకు ఉందని, విద్యార్థులకు సమావేశం ఏర్పాటుచేసుకునే హక్కు ఉందని తెలిపాడు. క్యాంపస్‌లో సామాజిక న్యాయం కోసం, రోహిత్‌ ఆత్మకు శాంతి కలగడానికి, అతడి కలను నెరవేర్చడానికి ఉద్యమం కొనసాగించడం తన లక్ష్యమని అన్నాడు. కన్హయ్య రాక సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. దాంతో అతడిని అరెస్టు చేస్తారన్న అనుమానాలు తలెత్తినా, అలాంటి ఉద్దేశం ఏదీ లేదని విమానాశ్రయంలో ఉన్న పోలీసులు చెప్పారు.యూనివర్సిటీకి సంబంధించినవాళ్లు తప్ప విూడియా, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఎవరినీ ప్రాంగణంలోకి అనుమతించబోమంటూ హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌  పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. మెయిన్‌ గేటు తప్ప అన్నింటినీ మూసేస్తామని అందులో తెలిపారు. తగిన భద్రత కల్పించాల్సిందిగా కోరారు. ఇప్పటికే హెచ్‌సీయూ ప్రాంగణం మొత్తం పోలీసు పహరాతో కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మరోవైపు విద్యార్థి సంఘాలు మాత్రం గట్టి పట్టుదలతోనే కనిపిస్తున్నాయి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ ప్రాంగణంలోనే సభ నిర్వహించుకుంటామని, తమకు వేరే వేదిక ఏవిూ లేదని నాయకులు బుధవారం ఉదయం కూడా స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీలో మళ్లీ వీసీ అప్పారావు ప్రవేశించడం వల్లే ఉద్రిక్తతలు చెలరేగాయని వాళ్లు ఆరోపించారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్‌ పార్టీ తన మద్దతు తెలిపింది. సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు బుధవారం ఉదయం యూనివర్సిటీ గేటు వరకు వెళ్లి అక్కడ కాసేపు ఆందోళన నిర్వహించారు. గతంలో ఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాంగ్రెస్‌ నేత వంశీచంద్‌ రెడ్డి కూడా యూనివర్సిటీ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.