లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

3ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు ఉదయం 40 పాయింట్లకు పైగా లాభపడి  24,643 వద్ద ట్రేడ్ అవుతోంది.  ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 50 పాయింట్లతో ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభమైంది. మరోవైపు రూపాయి 15 పైసలు బలహీనపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 67.98గా ఉంది.

జనవరి డెరివేటివ్‌ క్రాంటాక్టుల గడువు రేపు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు నేడు ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. రోలోవర్లు తక్కువ స్థాయిలో ఉండొచ్చన్న అంచనాల నేపథ్యమే ఇందుకు కారణం. నేడు ముగియనున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశాల్లో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచొచ్చన్న అంచనాలను మదుపర్లు సానుకూలంగా తీసుకోవచ్చు. దిగ్గజ కంపెనీలు నేడు వెలువరించనున్న ఆర్థిక ఫలితాల ప్రభావమూ మన మార్కెట్లపైన కనిపించొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలు ప్రపంచ మార్కెట్లపై చూపే ప్రభావాన్ని కూడా మదుపర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. మంగళవారం ఆసియా మార్కెట్లు నష్టాలతో ముగియడం; ఐరోపా మార్కెట్లు లాభాలను ఆర్జించడం; అమెరికా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైన నేపథ్యంలో మన మార్కెట్లు కూడా తదనుగుణంగా స్పందించే వీలు ఉంది. నేడు నిఫ్టీ 7350-7480 పాయింట్ల మధ్య చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 7500 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఎదురు కావొచ్చని సూచిస్తున్నారు.

మన మార్కెట్లు పని చేయలేదు : గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పని చేయలేదు. ఇతర ప్రధాన మార్కెట్లకు కూడా సెలవే.