లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు


ముంబయి, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : దలాల్‌ స్టీట్ర్‌కు మళ్లీ లాభాల కళ వచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం, కేంద్రం-ఆర్‌బీఐ మధ్య నెలకొన్న విభేదాలతో బుధవారం ఉదయం భారీ ఊగిసలాటతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత బలంగా పుంజుకున్నాయి. ఆర్‌బీఐపై కేంద్రం చేసిన సానుకూల వ్యాఖ్యలతో ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది. ఫలితంగా బుధవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి.
ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 163 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే రూపాయి పతనంతో ఒత్తిడికి గురైన సూచీ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. ఆ తర్వాత కేంద్రం ప్రకటనతో సూచీలు పుంజుకున్నాయి. కొనుగోళ్ల అండతో భారీ లాభాల దిశగా పరుగులు తీశాయి. మార్కెట్‌ ముగిసే
సమయానికి సెన్సెక్స్‌ 551 పాయింట్లు ఎగబాకి 34,442 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 188 పాయంట్ల లాభంతో 10,387 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో మళ్లీ 74 స్థాయిని దాటిన రూపాయి ఆ తర్వాత కాస్త కోలుకుని 73.97గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో టెక్‌ మహింద్రా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ్గ/నాన్స్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌ షేర్లు లాభపడగా.. కోల్‌ఇండియా, టాటాస్టీల్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హిందాల్కో, మారుతి షేర్లు నష్టపోయాయి.