లారీ యజమానులతో చర్చలు సఫలం
– సమ్మె విరమణ
హైదరాబాద్,జూన్25(జనంసాక్షి):
లారీ యజమానులు సమ్మె విరమించారు. తెలంగాణ సర్కార్ తక్షణమే స్పందించి చర్చలు జరపడంతో సమస్య కొలిక్కి వచ్చింది. లారీ యాజమాన్య సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాయలంలో గురువారం ఉదయం తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చర్చలు జరిపారు. ఇందులో మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మంత్రులతో లారీ యజమానుల సంఘం నేతలతో చర్చలు జరిపారు. వాహనపు పన్ను తగ్గింపు, సింగిల్ స్టేట్ పర్మిట్ జారీ అంశాలపై సానుకూలత వ్యక్తం చేసిన మంత్రులు, డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రివర్గం ఉప సంఘం ఏర్పాటుకు అంగీకరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హావిూ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు లారీ యజమానుల సంఘం నేతలు ప్రకటించారు.లారీ యజమానుల డిమాండ్లను మూడు వారాల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. లారీ యజమానులు మంత్రితో జరిపిన చర్చలు సఫలమవడంతో గత రెండు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. చర్చల సఫలం అనంతరం మంత్రి విూడియా ద్వారా మాట్లాడుతూ.. సింగిల్ స్టేట్ పర్మిట్ జారీ, వాహన పన్ను తగ్గింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. లారీ యజమానుల సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, వచ్చే మూడు వారాల్లో లారీ యజమానుల డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తమని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి నుంచి లారీ యజమానుల సమ్మె కొనసాగుతోంది. లారీల సమ్మెపై గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి నివాసంలో చర్చలు కొనసాగాయి. లారీ యజమానులతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. సింగిల్ స్టేట్ పర్మిట్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం హావిూ ఇచ్చింది. సింగిల్ పర్మిట్ విధానంపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారంలోగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి హావిూ ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం అవడంతో తెలంగాణ వ్యాప్తంగా లారీ యాజమానులు సమ్మెను విరమించారు.