లైంగికదాడి.. దోపిడీకి 100ఏళ్ల శిక్ష ఓ జడ్జి సంచలన తీర్పు

న్యూయార్క్‌: వృద్ధురాలిపై లైంగిక దాడి చేసిన కేసులో ఓ న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. ఈ కేసులో 23ఏళ్ల యువకుడికి 100ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఓ కోర్టు తీర్పు వెలువరించింది. అసలేం జరిగిందంటే..చికాగోలోని బాలింగ్‌బ్రూగ్‌ ప్రాంతానికి చెందిన టెవిన్‌ రేనీ 2015లో ఓ 89ఏళ్ల వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. వృద్ధురాలి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన టెవిన్‌ ఆమెను తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం మహిళను ఏటీఎంకు తీసుకెళ్లి ఆమెతో డబ్బు డ్రా చేయించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెవిన్‌ను అరెస్టు చేశారు. గతవారం ఈ కేసు విచారణ చేపట్టిన డుపేగ్‌ కౌంటీ జడ్జి బ్రేన్‌ టెలండర్‌ టెవిన్‌ను దోషిగా నిర్ధారించి.. సంచలన తీర్పు వెల్లడించారు.లైంగికదాడికి గానూ 60ఏళ్లు, దొంగతనానికి గానూ.. 40ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు శిక్షలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా.. కేసులో 85 శాతం అనుభవించిన తర్వాతే పెరోల్‌కు దరఖాస్తు చేసుకునే వీలుంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేసు తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేశారు.