లైసెన్స్ లేకపోతే.. వాహనం సీజ్

666లైసెన్స్ లేకుండా వాహనం నడిపిస్తున్నారా….  ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్తా….మీరు ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఇక మీ మీద ఛార్జిషీటు పడుతుంది. దీంతో మీకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ కు  విరుద్ధంగా లైసెన్స్ లేకుండా రోడ్లపైకి వస్తే ఇక మీ వాహనాన్ని సీజ్ చేస్తారు పోలీసులు. ఆ తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిస్తున్నారని ఆరోపణ మోపి దాని మీద పూర్తి ఆధారాలతో కూడిన ఛార్జీషీటును కోర్టులో దాఖలు చేస్తారు.ఈ ఛార్జిషీటును పరిశీలించి కోర్టు వాహనదారుడి ట్రాఫిక్ ఉల్లంఘనపై శిక్షను ఖరారు చేస్తుంది. ఈ విధమైన చర్యలు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గత 15 రోజుల నుంచి మొదలు పెట్టారు. ఒక అల్వాల్ ట్రాఫిక్ పరిధిలో 50కి పైగా లైసెన్స్ లేనివారి మీద ఛార్జిషీటులను దాఖలు చేశారు. ఇక మిగతా టాఫ్రిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో పరిశీలిస్తే రోజుకు 15పైగా వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై ఛార్జీషీటులు నమోదవుతున్నాయి. ఇలా లైసెన్స్ లేకుండా పదేపదే పట్టుబడితే … జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. లైసెన్స్ లేకుండా, ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు జరుగుతున్నాయని  ట్రాఫిక్ పోలీసుల సర్వేలో తేలింది. దీని వల్ల ఇతర వాహనదారులు డేంజర్ లో పడుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ చట్టపరమైన చర్యల అమలను తప్పనిసరి చేశారు.

తాజాగా సుప్రీం కోర్టు కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలను తీసుకుంటున్నారు పోలీసులు. ప్రధానంగా  బైకర్స్, ప్యాసింజర్ ఆటో డ్రైవర్‌లు లైసెన్స్ లేకుండా రోడ్లపైకి వస్తున్నట్లు ఈ ఛార్జీషీటుల ద్వారా బయటపడింది.మరో వైపు డ్రంకన్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ అంశాలను కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.