లొంగిపోయెందుకు మరింత గడువివ్వండి

సుప్రీంలో సంజయ్‌దత్‌ పిటిషన్‌
న్యూఢీల్లీ , ముంబై: లొంగిపోయేందుకు మరింత సమయమివ్వాలని కోరుతూ నటుడు సంజయ్‌దత్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన 4 వారాల గడువు ఈ వారంతో ముగియనుండటంతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు దోషిగా నిర్ధారించిన సుప్రీంకోర్టు.. బెయిల్‌పై ఉన్న దత్‌ను లొంగిపోవాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.అయితే తనను నమ్ముకుని పలువురు నిర్మాతలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని వారు నష్టపోకుండా ఈ సినిమా సంబంధిత ప్రాజెక్టులన్నీ చేసేందుకు వీలుగా లొంగిపోయెందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని ఆయన సుప్రీంను కోరారు.
ఇప్పటికే 18 నెలలు జైల్లో గడిపిన సంజయ్‌దత్‌ మరో మూడున్నరేళ్ల శిక్షను అనుభవించాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఈ నెల 18లోగా ఆయన ముంబైలోని టాడా కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఇలావుండగా ఈ కేసులో మరో ముగ్గురు దోషులు జైబున్నీ సా అన్వర్‌ కాజీ, ఇషాక్‌ మహ్మద్‌ హజ్వానే , షరీఫ్‌ అబ్దుల్‌ గపూర్‌ అలియాస్‌ దాదాభాయ్‌లు కూడా లొంగిపోయేందుకు మరింత సమయం కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. తాము దాఖలు చేసిన క్షమాబిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు తమకిచ్చిన గడువును పొడిగించాలని వారు విజ్ఞప్తి చేశారు. వీరి పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది.