లోకల్‌ రైలెక్కిన రైల్వే మంత్రి

ముంబయి,ఏప్రిల్‌22 : ఓ కేంద్రమంత్రి తన కాన్వాయ్‌ని విడిచి రైలెక్కారు. అది కూడా తాను వెళ్లాల్సిన చోటుకి ఆలస్యమవకుండా ఉండేందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు. . ఆ రైలెక్కిన మంత్రి మరెవరో కాదు స్వయంగా రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు. లోకల్‌ రైలులో ప్రయాణించి.. ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్లారు. కుర్రే రోడ్‌ స్టేషన్‌ సవిూపంలోని ఓ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సురేశ్‌ ప్రభు అక్కడి నుంచి మంత్రాలయలో ముఖ్యమంత్రి దేవేంద్రఫడణవిస్‌ పాల్గొనే సమావేశానికి వెళ్లాల్సి ఉంది. అయితే కారులో వెళ్తే ఆలస్యమవుతుందని భావించిన సురేశ్‌ ప్రభు.. ఛత్రపతి శివాజీ  టర్మినస్‌కి వెళ్లడానికి లోకల్‌ రైలు ఎక్కారు. రైలులో కేంద్రమంత్రిని చూడగానే.. ప్రయాణికులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే ప్రభు మాత్రం చిరునవ్వు చిందిస్తూ.. ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రభు వెంట సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఎస్‌కే సూద్‌ సహా, పలువురు రైల్వే ఉన్నతాధికారులు, భద్రతాసిబ్బంది ఉన్నారు. ఫస్ట్‌క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన ప్రభు.. స్టేషన్‌ వచ్చే దాకా నిలబడే ఉన్నట్లు ప్రయాణికులు చెప్పారు. ప్రయాణికుల్లో ఒకరు తమ కుటుంబంలో జరుగుతున్న వివాహానికి రావాల్సిందిగా మంత్రిగారికి ఆహ్వానపత్రిక అందజేయగా ఆయన చిరునవ్వుతో దానిని స్వీకరించారు.  కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభు లోకల్‌ రైలులో ప్రయాణించడం ఇది రెండోసారి. గతేడాది మొబైల్‌ టికెట్‌ సిస్టమ్‌ ప్రారంభం సందర్భంగా దాదర్‌ నుంచి ముంబయి వరకు ప్రభు రైలులో ప్రయాణించారు. ముంబయి నగరానికి చెందిన సురేశ్‌ ప్రభు రాజకీయాల్లోకి రాకముందు సబర్బన్‌ రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేవారు.