లోక్‌సభ మాజీ స్పీకర్ సంగ్మా కన్నుమూత

14

లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ.సంగ్మా(68) కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1947 సెప్టెంబరు 1న మేఘాలయాలోని వెస్ట్‌ గారోహిల్స్‌ ప్రాంతంలో సంగ్మా జన్మించారు. షిల్లాంగ్ లోని సెయింట్‌ ఆంథోనీస్‌ కళాశాలలో బీఏ హానర్స్‌ పూర్తిచేశారు. 1996 నుంచి 1998 వరకు 11వ లోక్‌సభకు ఆయన స్పీకర్ గా వ్యవహరించారు.

సంగ్మా 1988-1990 మధ్య మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం మేఘాలయలోని తురా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013 జనవరి 6న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీని స్థాపించారు. సంగ్మా కుమార్తె కేంద్రమంత్రిగా పనిచేశారు.

సంగ్మా మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్‌గా విజయవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు.. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గొంతుకగా ఆయన పని చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశవ్యాప్తంగా పీఏ సంగ్మాకు మంచి పేరుందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి సంగ్మా ఇచ్చిన నైతిక మద్దతు ఎన్నడూ మరువలేనిదన్నారు. పీఏ సంగ్మా కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీ కవిత కూడా సంగ్మా మృతి పట్ల సంతాపం తెలిపారు.

సంగ్మా మృతి పట్ల పలువురు కేంద్రమంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.