లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కన్నుమూత

కోల్‌కతా(జ‌నం సాక్షి ): లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ(89) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. 1971 నుంచి 2009 వరకు ఎక్కువ సార్లు లోక్‌సభకు ఎన్నికైన వారిలో సోమ్‌నాథ్ ఒకరు. ఆ మధ్యకాలంలో 1984లో మాత్రం మమతా బెనర్జీ చేతిలో ఆయన ఓడిపోయారు. కాగా 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ 2008వరకు అదే పార్టీలో కొనసాగారు. యూపీఏ-1 ప్రభుత్వంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. అయితే, యూపీఏ ప్రభుత్వం చేసుకున్న భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అనూహ్యంగా 2008లో సీపీఎం మద్దతు ఉపసంహరించింది. కానీ, సోమ్‌నాథ్ లోక్‌సభ స్పీకర్‌ పదవి నుంచి తప్పుకోడానికి సనేమిరా అనడంతో ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు. మరోవైపు ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.