వంటగ్యాస్‌పై మరింత భారం

దిల్లీ: సబ్సీడీలను తొలగించేందుకు వంటగ్యాస్‌పై మరింత భారం మోపనుంది కేంద్రప్రభుత్వం. ఇక నుంచి నెలవారీగా వంటగ్యాస్‌ ధరను పెంచనుంది. సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌పై ప్రతి నెలా రూ.4 పెంచాలని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలను ఆదేశించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సోమవారం తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

‘14.2 కేజీల సబ్సీడీ వంటగ్యాస్‌ సిలిండర్‌పై నెలకు రూ.2 చొప్పున పెంచాలని ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థకు గత ఏడాదే చెప్పాం. తాజాగా దాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇలా వచ్చే ఏడాది మార్చి నాటిని వంటగ్యాస్‌పై సబ్సీడీని తొలగించాలని భావిస్తున్నాం’ అని ధర్మేంద్రప్రదాన్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం సబ్సీడీ కింద ఏడాదికి 12 గ్యాస్‌ సిలిండర్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత 13వ సిలిండర్‌ నుంచి మార్కెట్‌ రేటుకే విక్రయిస్తున్నారు. కాగా.. గతేడాది జులై 1 నుంచి సబ్సీడీ సిలిండర్‌పై ప్రతి నెలా రూ.2 (వ్యాట్‌ కాకుండా) పెంచుతూ వస్తున్నాయి ఆయిల్‌ కంపెనీలు. అయితే ఈ ఏడాది జూన్‌ 1 నుంచి నెలనెలా రూ. 4 పెంచాలని కంపెనీలను ఆదేశించినట్లు ప్రదాన్‌ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు లేదా సబ్సీడీ పూర్తిగా తొలగిపోయేంతవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ ధరల పెంపు కొనసాగుతోందని చెప్పారు. ప్రసుత్తం దిల్లీలో సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 477.46గా ఉంది.