వంతెన నిర్మాణంతో రవాణాకు అవకాశం
మెదక్,మే14(జనం సాక్షి): నర్సాపూర్ రాయరావు చెరువు అలుగులపై మెకానికల్ వంతెన నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి పంపించారు. నర్సాపూర్ రాయరావు చెరువు అలుగులపై వంతెన నిర్మాణానికి ఇటీవల నిపుణులైన ముగ్గురు ఇంజినీర్ల బృందం సందర్శించింది. 45 విూటర్ల పొడవునా మెకానికల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేశారు. పూర్తిగా ఇనుముతో కూడిన దీని ఏర్పాటుకు సుమారు రూ.కోటి వరకు వ్యయం చేయనున్నట్లు తెలిసింది. పర్యాటక ప్రదేశాల్లో ఉన్న ప్రత్యేక వంతెనల తరహాలో డిజైన్ చేస్తున్నారు. దీని నిర్మాణం ద్వారా పర్యాటకులను సైతం ఆకర్షించాలనేది స్థానిక అధికారుల, ప్రజాప్రతినిధుల ఆలోచన. ఇది కార్యరూపం దాలిస్తే ఈ వనరుకు ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయం. గతంలో ఇక్కడి అలుగుల ప్రదేశాన్ని సందర్శించిన నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ వంతెన నిర్మిస్తే కింది భాగంలో ఉన్న గ్రామాలు, తండాలకు రహదారి సౌకర్యం ఏర్పడుతుంది. ప్రధానంగా తుకారాం తండా, పెద్దమ్మగూడెం తండా, కాగజ్‌మద్దూర్, కొండాపూర్, గూడెంగడ్డ, నత్నాయిపల్లి, శేర్కాన్‌పల్లి, వడ్డేపల్లి, జిన్నారం, ఉట్ల, తదితర గ్రామాలకు వెళ్తేందుకు మార్గం సుగమమవుతుంది. చెరువు నిండినప్పుడు అలుగుల విూదుగా నీరు పొంగిపొర్లుతుంది. ఆ సమయంలో రాకపోకలు సాగించడం కష్టమే. దీంతో కొద్దినెలలకే పునాదులు తీశారు. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో చెరువు నిండటంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత రబీలో ఆయకట్టు భూములకు నీరు వదలడంతో నిల్వశాతం తగ్గింది. దీంతో పనుల ప్రారంభానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. వంతెన నిర్మాణం చేపట్టి దీనిపై భాగంలో రిసార్ట్స్‌ను, కాటేజీలను ఏర్పాటు చేయాలనేది సైతం ప్రతిపాదన. ఇవన్నీ పూర్తయితే ఈ చెరువుకు మహర్దశ పడుతుంది.
……………………..