వందకు పైగా సీట్లలో గెలుస్తాం

జగిత్యాలలో కూడా విజయం టిఆర్‌ఎస్‌దే

ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌

జగిత్యాల,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఘన విజయం సాధించబోతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. వందకు పైగా సీట్లతో విజయం సాధిస్తామని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అదే స్థాయిలో జరగాలి. సంక్షేమ పథకాలు కొనసాగాలి. ఇవన్ని జరగాలంటే విూరందరూ టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. అన్ని ఆలోచించి ఎవరూ గెలిస్తే న్యాయం జరుగుతుందో వారిని గెలిపించుకోవాలి. పోటీ కేవలం టీడీపీ – కాంగ్రెస్‌ కూటమి, టీఆర్‌ఎస్‌కు మాత్రమే. మిగతా వాళ్ల గురించి మనకు అనవసరం. అభివృద్ధి, సంక్షేమం ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దు. రెండు పార్టీలు కలిపి 58 ఏండ్లు పాలించాయి. వారి పరిపాలనలో కరెంట్‌ ఎట్ల ఉంది. ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించాలి. మేధావులమని మాట్లాడుతారు. మరి మేధావులు అయితే 24 గంటల కరెంట్‌ ఎందుకివ్వలేదు? అన్ని సంక్షేమ పథకాలు అద్భుతంగా ముందుకెళ్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ దుష్పచ్రారారాలను నమ్మొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. 55 ఏళ్ల పాటు సాగిన కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో అభివృద్ధి జరగలేదు. 24 గంటల కరెంట్‌, పెన్షన్లు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో విూకు తెలుసు. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి వంటి పథకాలు గతంలో చూశామా? భూమి దున్నుకున్న రైతుల నుంచి గత ప్రభుత్వాలు నీటి తీరువా వసూలు చేస్తే.. మేం రద్దు చేశాం. పైసా ఖర్చు లేకుండా పాసుపుస్తకాలు ఇచ్చి, సాగుకు పెట్టుబడి కూడా ఇచ్చాం. గత మేనిఫెస్టోలో లేకపోయినా.. బీడీ కార్మికులు, బోదకాల బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి విూ కండ్ల ముందే ఉంది. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయ్యాలి. చంద్రబాబు పెద్ద మేధావి అయితే 24 గంటల కరెంట్‌, ఉచిత కరెంట్‌ ఎందుకు ఇవ్వలేదు. తెలంగాణ నాలుగు మూలాలు తిరిగిన. ఎక్కడ పోయినా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రభంజనంలా ఉందన్నారు.