వచ్చేనెలలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు
పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గాన్ని హైదరాబాదు నగరంలా అభివృద్ధి చేస్తామని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గం లోని ఇస్నాపూర్ జంక్షన్ లో 12.63 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఇస్నాపూర్ జంక్షన్ వద్ద తనకు తెలిసి 60 నుంచి 70 మంది వరకు రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయారని చెప్పారు.
ఆరు నెలల్లో ఈ జంక్షన్ వద్ద ఆరు వరుసల రోడ్డు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ జంక్షన్ వద్ద ప్రమాదాలను జరిగినా పట్టించుకునే నాదుడులేరని విమర్శించారు. అశోక్ నగర్ గేట్ వద్ద కూరగాయల సంత పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య గతంలో ఉండేదన్నారు. అదే రీతిలో పటాన్‌చెరు లో మోరీ వద్ద గురువారం సంత జరగడం వల్ల రద్దీ సమస్య ఉండేదన్నారు.
ఈ సమస్యలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. ఈ సమస్య గుర్తించిన వెంటనే 50 కోట్ల విలువైన మార్కెటింగ్ శాఖ స్థలంలో 15 ఎకరాల భూమిలో 5 కోట్లతో ప్రజల సౌకర్యార్థం మార్కెట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గండి మైసమ్మ గుడి వద్ద వర్షం పడితే వరద నీరు నిలిచిపోయేదని నలభై ఏళ్లుగా ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. మరో రెండు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఇస్నాపూర్ వద్ద టోల్‌ట్యాక్స్ ను స్థానికుల నుంచి వసూలు చేసేవారని , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీలో కేంద్రంతో కొట్లాడి రద్దు చేయించారని చెప్పారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి 50 కోట్లతో కూకట్‌పల్లి నుంచి సంగారెడ్డి వరకు రోడ్డు మరమ్మత్తు పనులు చేయించామన్నారు. పాశమైలారంలో కాలుష్యం తగ్గించేందుకు 102 కోట్లతో ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ తో మాట్లాడి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
పాశమైలారం నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నాలుగు వరుసల రోడ్ ను 46 కోట్లతో మంజూరు చేయించినట్లు మంత్రి చెప్పారు. రాయసముద్రం, సాకి చెరువును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇందుకు15 కోట్లు మంజూరు చేసి పెద్దలు వాకింగ్ చేసేలా, పిల్లలు ఆడుకునేలా, మహిళలకు బతుకమ్మ పండుగ కు ఉపయోగించే విధంగా అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
రామచంద్రా పూర్ ప్రాంతంలోఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కరెంటు సహా అనేక రాయితీలను ఇస్తోందన్నారు. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వచ్చేలా నాలుగు వరుసల రోడ్ సహా అనేక రాయితీలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే ఇంటింటికితాగు నీరు ఇవ్వనున్నట్లుచెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో కొత్తగా బొల్లారం, అమీన్ పూర్ , తెల్లాపూర్ మున్సిపాలిటీలు ఏర్పడ్డాయని , వాటి అభివృద్ధికి ఒక్కో మున్సిపాలిటీ కి 20 కోట్లు ఇచ్చేలా మంత్రి కేటీఆర్ తో మాట్లాడి మంజూరు చేయిస్తానన్నారు.
పటాన్‌చెరులో 30వేల డబుల్ బెడ్ రూంలు కట్టిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సంగారెడ్డి – నాందేడ్ – అకోలా 140కిలోమీటర్ల వరకు నాలుగు వరుసల రోడ్ కు టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తయితే పటాన్‌చెరు, ఆందోల్, నారాయణ ఖేడ్ నియోజకవర్గాలు ఏంతో అభివృద్ధి సాధిస్తాయన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంతోకృషి చేస్తున్నారని, ప్రజలు వారిని దీవించాలని కోరారు. గత ఎమ్మెల్యేలు తమ అభివృద్ధికి మాత్రమే పనిచేసారని విమర్శించారు.