వచ్చే ఎన్నికల్లో నేనే ప్రధాని అభ్యర్థిని

 

– దేశంలో వారసత్వం మామూలే

– రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి):వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంకేతాలిచ్చారు. వారసత్వరాజకీయాలు కొత్తేవిూ కాదని సెలవిచ్చారు. రెండు వారాల పర్యటన నిమిత్తం ఆయన అమెరికా వెళ్లిన రాహుల్‌ బెర్క్‌లీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఆయన ప్రసంగించారు. ‘ఇండియా ఎట్‌ 70: రిప్లెక్షన్స్‌ ఆన్‌ ది పాత్‌ ఫార్వర్డ్‌’ అనే అంశంపై మాట్లాడిన రాహుల్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ గాంధీ తెలిపారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కానీ ఆ నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీ ఆధీనంలో ఉందన్నారు. విభజన రాజకీయాలు ప్రజలను వేరుచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ప్రధానిగా పోటీ చేస్తారా’ అని అడిగిన ప్రశ్నకు రాహుల్‌ ‘అవునని’ సమాధానమిచ్చారు. ‘నేను పీఎం పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మాది సంస్థాగత పార్టీ. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం దీనిపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.నేను మాత్రమే వారసత్వ రాజకీయాల్లో వచ్చాను అనుకోవద్దు.. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఇదే పద్ధతి ఉంది. అఖిలేశ్‌ యాదవ్‌, స్టాలిన్‌ ఇలా వచ్చిన వారే. అంతెందుకు బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, పారిశ్రామికవేత్త అంబానీ సోదరులు కూడా వారసత్వం ద్వారా వెలుగులోకి వచ్చిన వారే ‘ అని రాహుల్‌ తెలిపారు. ఈ సందర్భంగా జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దుపై కూడా రాహుల్‌ ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతోందని, వ్యవసాయానికి, రైతులకు తీరని నష్టం వాటిల్లుతోందని రాహుల్‌ అన్నారు.

మెరికా పర్యటనలో భాగంగా రాహుల్‌ ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. కాలిఫోర్నియాలో పర్యటన ముగించుకుని లాస్‌ ఏంజిల్స్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్‌, న్యూయార్క్‌ల్లో పర్యటించి ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆయన విద్యార్థులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ పాలన పట్ల కూడా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. విభజన రాజకీయాలతో మోదీ దేశాన్ని చీలుస్తున్నారని రాహుల్‌ అన్నారు. తనతో పనిచేస్తున్న ఎంపీలతోనూ మోదీ అభిప్రాయాలు పంచుకోలేరన్నారు. సభల్లో జనం కోసం వివిధ రకాల సందేశాలను ఇవ్వడంలో మోదీ దిట్ట అని, చాలా ప్రభావంతమైన సందేశాలను ప్రధాని ఇస్తారని రాహుల్‌ అన్నారు. మోదీ దగ్గర అద్భుతమైన నైపుణ్యం ఉందని, ప్రధాని తన కన్నా మంచి వక్త అన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్లే కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు పెరిగాయని రాహుల్‌ అన్నారు. అందువల్లే అక్కడ హింస పెరిగిందన్నారు. రాజకీయాల్లోకి యువతను తీసుకువచ్చేందుకు పీడీపీ పార్టీ కీలక పాత్ర పోషించిందని, కానీ మోదీ వాళ్లతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని దెబ్బతీసారన్నారు. కేవలం 30 రోజుల్లోనే పీడీపీని నాశనం చేశారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కశ్మీర్‌లో శాంతి నెలకొల్పామన్నారు. జమ్మూకశ్మీర్‌ అంశంపై సుమారు తొమ్మిదేళ్ల పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌, మంత్రులు చిదంబరం, జైరామ్‌ రమేశ్‌లతో పనిచేసినట్లు రాహుల్‌ గుర్తు చేశారు. హింస వల్లనే తన తండ్రి, నానమ్మను కోల్పోయానని, అలాంటి హింసను తాను అర్థం చేసుకోకపోతే మరి ఎవరు అర్థం చేసుకుంటారని రాహుల్‌ ప్రశ్నించారు. తనపై ఆరోపణలను చేసేందుకు బీజేపీ ప్రత్యేక వ్యవస్థను నడిపిస్తోందన్నారు. దేశాన్ని నడిపిస్తున్న వారే ఆ టీమ్‌లో ఉన్నారన్నారు. ఓ వెయ్యి మంది కంప్యూటర్‌ ముందు కూర్చుని తనపై ఆరోపణలు చేస్తుంటారని రాహుల్‌ విమర్శించారు. ఆర్టీఐని మోదీ దెబ్బతీశారన్నారు. ప్రజాస్వామ్య వాతావరణంలో భారత్‌ ఉద్యోగాలు కల్పించాలన్నారు. చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌, పార్లమెంట్‌ సలహాలు తీసుకోకుండానే మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని, దీని వల్ల పెద్ద నష్టం జరిగిందన్నారు. కోపం, ద్వేషం, హింస మనల్ని నాశనం చేస్తుందన్నారు. అహింస అనే సిద్దాంతంపై దాడి జరుగుతోందన్నారు. చిన్న, మధ్య శ్రేణి వ్యాపారవేత్తలే భారత ఆర్థిక ప్రగతికి నిదర్శనమన్నారు. పేదలను అభ్యున్నత స్థాయికి తీర్చి దిద్దిన భారత్‌ తరహాలో మరో ప్రజాస్వామ్య దేశం లేదన్నారు.