వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే

– తెరాసకు పట్టం గట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడులకు.. టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు
– టీఆర్‌ఎస్‌ నేత, ఎంపీ కవిత
నిజామాబాద్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే ఉంటుందని, తెలంగాణకు పట్టంగట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్‌ నేత, నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు సిద్ధాంతాలు పక్కన పెట్టేశాయని విమర్శించారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానని, అలాంటిది ఆ రెండు పార్టీలు జతకట్టడం అనైతికమని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఇక ప్రజలెలా ఆమోదిస్తారని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీల అపవిత్ర పొత్తును ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులకు టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధం లేదని కవిత అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కొడంగల్‌, హైదరాబాద్‌లోని రేవంత్‌ నివాసాలు, వ్యాపార కార్యాలయాలతో పాటు సన్నిహితుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు. కేవలం ఓ లాయర్‌ ఇచ్చిన సమాచారం మేరకు దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఐటీ దాడులను సైతం కాంగ్రెస్‌ నేతలు సానుభూతికోసం వాడుకుంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలను, కేసీఆర్‌ను తిట్టడమే కాంగ్రెస్‌ నేతలు పనిగా పెట్టుకున్నారని, తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారని కవిత అన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కాంగ్రెస్‌ 60ఏళ్లపాలనలో, తెరాస నాలుగేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని రాష్ట్రంలో లేకుండా తరిమేసేందుకు సిద్ధమయ్యారని కవిత అన్నారు.