వచ్చే ఏడాదిలో 6 లక్షల మందికి ఉద్యోగాలు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
శ్రీకాకుళం, జూలై 29 : రాజీవ్‌ యువకిరణాల ద్వారా వచ్చే ఏడాది ఆరు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు రెండు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక అంబేద్కర్‌ ఆడిటోరియంలో రాజీవ్‌ యువకిరణాలు, రాజీవ్‌ ఉద్యోగ కిరణాల ద్వారా ఉద్యోగం పొందిన యువతతో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజీవ్‌ యువకిరణాలు, రాజీవ్‌ ఉద్యోగ కిరణాలకు లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో అధిక శాతం పై చదువులు ఉన్నా వారే ఉన్నారని అన్నారు. పది, ఇంటర్‌, డిగ్రీలోపల చదువుకునే వారికి ఉపయోగపడే విధంగా ఈ పథకం ఏర్పాటు చేశామని, అయితే పై చదువులు చదువుకున్న వారు కూడా దీని ద్వారా ఉద్యోగం పొందేందుకు దరఖాస్తు చేసుకోవడం బాధాకరమన్నారు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం పొందిననాడే ఆ వ్యక్తికి తృప్తి ఉంటుందని, అలాగే రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కూడా ఉంటుందన్నారు. ఉన్నత చదువులు చదువుకునే వారికి కూడా ఉపయోగపడే ఉపాధి, ఉద్యోగ పథకాలను అన్వేషిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక శాఖలలో కాంట్రాక్టు పద్ధతి నడుస్తుందని, దీనిలో సమూల మార్పులు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలాగే లంచం లేదా పలుకుబడి ఉంటే తప్ప ఉద్యోగం రాదన్న నానుడిని కూడా పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల ఒక్క ఏడాదిలోనే విఆర్వో, విఆర్‌ఎ, ఎపిపిఎస్సీ, అలాగే పోలీస్‌ శాఖలోను లక్షల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. ఏ ఉద్యోగంలోనైనా లంచం ద్వారా లభించిందన్న మాటలు వినిపించాయా అని కార్యక్రమంలో పాల్గొన్న యువతను ముఖ్యమంత్రి అడిగారు. కార్యక్రమంలో భాగంగా తొలిత ఈ పథకం ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న యువతను గతంలో వారి పరిస్థితి, ఇప్పటి వారి అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మురళీమోహన్‌, ఎంపి కృపారాణి, ఎమ్మెల్యేలు నీలకంఠం నాయుడు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన హెలిక్యాప్టర్‌లో వెళ్లారు.