వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
కరోనా విజృంభణ వేళ అవసరమా అన్న తర్జనభర్జన
ఇటీవల బెంగాల్, బీహార్, అసోం ఎన్నికల నిర్వహణ
అమెరికాకు లేని భయం మనకు అక్కర్లేదంటున్న విశ్లేషకులు
న్యూఢల్లీి,డిసెంబర్25(జనం సాక్షి): దేశంలో వచ్చే ఏడు జరిగే పలు రాష్టాల్ర ఎన్నికలపై ఇప్పుడు దేశంలో తర్జనభర్జన జరుగుతోంది. ఎన్నికలను వాయిదా వేయాలన్న అలహాబాద్ హైకోర్టు సూచనలతో సర్వత్రా చర్చ సాగుతంది. దీనిపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారిపోయిన అగ్రదేశం అమెరికాలో ఎన్నికలు వాయిదా వేయకుండా నిర్వహించడం చూసాం. కొవిడ్ నిబంధనలకు పాటిస్తూనే అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిర్వహించారు. గతేడాది నిర్వహించిన ఎన్నికల్లో జో బైడన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్కడ వైరస్ విస్తృత రూపం దాల్చాక రాజకీయ పార్టీల ర్యాలీలపై నిషేధం విధించారు. నిధులసేకరణ, జనసవిూకరణ, బహిరంగ సమావేశాలను రద్దు చేశారు. ప్రచారమంతా ఆన్‌లైన్‌లోనే సాగింది. డిజిటల్ క్యాంపెయిన్లతో ప్రచారం హోరెత్తించారు. ఇక పోలింగ్ విషయంలో కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో మాస్క్‌లు
తప్పనిసరి చేశారు. సాధ్యమైనంతవరకు జనాలు గూమిగూడ కుండా చాలామందికి మెయిల్ ద్వారా తమ బ్యాలెట్ పేపర్లను పంపే సౌలభ్యం కల్పించారు. ఇక 2020లో దక్షిణ కొరియాలో జరిగిన ఎన్నికలైతే ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. గత 28 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 66.2 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా కాలంలోనూ ఇలా భారీగా పోలింగ్ నమోదవ్వడానికి ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠమైన చర్యలే ప్రధాన కారణం. ముందస్తుగానే పోలింగ్ కేంద్రాలను శానిటైజేషన్ చేసింది. మాస్క్‌లు, గ్లౌవ్స్, హ్యాండ్ శానిటైజర్లను కచ్చితంగా ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఓటర్లను పోలింగ్ బూత్‌ల్లోకి అనుమతించారు. 99.5 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నవారిని ప్రత్యేక పోలింగ్ బూత్‌ల్లోకి పంపి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక కొవిడ్ బాధితులు మెయిల్ ద్వారా తమ బ్యాలెట్ పేపర్‌ను పంపించే సౌలభ్యం కల్పించారు. ఇక హోం క్వారంటైన్, ఐసోలేషన్ ఉన్నవారిని సాయంత్రం 6 తర్వాత అది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోకి పంపి ఓటు వేయించారు. ఇదే విషయాన్‌ఇన మనవాళ్లు కూడా ప్రస్తావిస్తున్నారు. కరోనా ఉన్నా జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించవచ్చని రాజకీయపార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు గతంలో జరిగిన బీహార్, బెంగాల్, అసోం తదితర రాష్టాల్ర ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా డెల్టా, డెల్టా వేరియంట్‌లా తీవ్రత ఉండకపోవచ్చన్న అభిప్రా యాలు వినిపిస్తున్నాయి. ఇక ఒమిక్రాన్ బారిన పడుతున్నవారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని వేగంగానే కోలుకుంటున్నారు. ఇతర వేరియంట్ల కంటే ప్రాణాంతకం కాకపోవచ్చని కొన్ని అధ్యయానాలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో మూడో దశ ఉద్ధృతిని ముందే వూహించి ఎన్నికలను వాయిదా వేయాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈనేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎలా ఉంటుందో రాబోయే రెండు వారాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ఎన్నికల సమయానికి తగినంత సమయం ఉందని, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఎన్నికల వాయిదాపై పునరాలోచన చేయాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ఇక కరోనా వైరస్ ఇప్పట్లో అంతమవ్వదని ఈ వైరస్ ప్రభావం మరో మూడేళ్ల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో మహమ్మారి కారణంగా అన్ని రోజుల పాటు ఎన్నికలను వాయిదా వేయడం రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అలహాబాద్ హైకోర్టు సూచనల నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఐదురాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.