వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళ నోట్లో మూత్రం
పట్నా : అప్పు కట్టినప్పటికీ.. అదనపు వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళను వివస్త్రను చేసి, ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఈ అనాగరిక ఘటన బిహార్ రాజధాని పట్నాలో జరిగింది. పట్నా జిల్లా మోసిమ్పుర్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త.. స్థానికుడి వద్ద కొన్ని నెలల కితం రూ.1500 అప్పు తీసుకుని, వడ్డీతో సహా తిరిగి చెల్లించారు.. అదనపు వడ్డీ ఇవ్వలేదనే సాకుతో వారిపై కోపం పెంచుకున్న వ్యక్తి.. గతవారం సదరు మహిళకు ఫోన్ చేసి బెదిరించాడు. అదనపు వడ్డీ ఇవ్వకపోతే గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని బెదిరించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గత శనివారం రాత్రి అనుచరులతో కలిసి మహిళ ఇంటికి వెళ్ళి, ఆమెపై దాడి చేశాడు. వివస్త్రను చేసి కర్రలతో కొట్టించడమేగాక, తన కుమారుడితో మహిళ నోట్లో మూత్రం పోయించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.