వడ్డెర సహకార సంఘాలకు నిధులు కేటాయించాలి
నిజామాబాద్, ఆగస్టు 2 : వడ్డెర సహకార సంఘాలకు నిధులు కేటాయించాలని వడ్డెర వృత్తి దారుల సంఘం జిల్లా కమీటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని వడ్డెర వృత్తి సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం వడ్డెరులను స్వార్థం కోసం వాడుకుంటుందని, ఎన్నికల్లో వాడుకుని తర్వాత మరిచిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం గతంలో వడ్డెర సహకార సోసైటీలను ఏర్పాటు చేసిందని కానీ ప్రభుత్వ సహాయం నామ మాత్రంగా ఇచ్చిందన్నారు. ప్రస్తుతం సహకార సంఘాలతో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసిందని, గత సంవత్సరం 25లక్షలు కేటాయించింది కానీ ఆ నిధులు కార్పోరేషన్ ఖర్చులకు అయ్యాయని, ఈ సంవత్సరం ఐదు కోట్ల నిధులు కేటాయించి, వడ్డెర సహకార సంఘాలకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా, రాజకీ యంగా వెనుకబడిన వడ్డెరులకు ప్రత్యేక నిధిని కేటాయించి, వడ్డెర వృత్తిదారులను అభివృద్ధి చేయాలని అన్నారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ, వడ్డెరులకు గుట్టలపై పూర్తి హక్కు కల్పించాలని , బ్యాంకుల ద్వారా ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని ఈ నెల 6న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.