వణికిన ఉత్తరాది

4

– భూకంప ప్రకంపనలతో పరుగులు తీసిన జనం

– బీహార్‌లో 17 మంది మృతి

న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి):

ఉత్తర భారతం మళ్లీ కంపించింది. ఢిల్లీ, బీహార్‌, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌లలో మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఇళ్లనుంచి పరుగులు తీశారు. భూమి కంపించడం ప్రారంభం కావడంతోనే ఢిల్లీలో పై అంతస్తులలో నివసిస్తున్న ప్రజలు పరుగు పరుగున క్రిందికి వచ్చారు. కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా భయకంపితులై బయటకు పరుగులు తీశారు. బీహార్‌లో భూకంప తీవ్రతకు 17 మంది మృతి చెందినట్లు గుర్తించారు.  మిగిలిన రాష్ట్రాల్లో ఏ మేరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందీ తెలియరాలేదు. అయితే యూపిలో పలుప్రాంతాల్లో పురాతన భవనాలు కూలినట్లు సమాచారం. అలాగే దక్షిణ భారతదేశంలో ఒడిశా, తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖ పట్నం జిల్లాల్లోనూ పలుచోట్ల భూ ప్రకంపనలు చోటు సంభవించాయి. అఫ్ఘనిస్తాన్‌ కేంద్రంగా మంగళవారం ఈ భూ ప్రకంపనం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. భూమి ఉపరితలం నుంచి 19 కిలోవిూటర్ల లోతులో భూమి కంపించినట్టు భూప్రకంపన అధ్యయన కేంద్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల భూమి 7.2 గా, మరికొన్నిచోట్ల 6.9 గా రిక్టర్‌ స్కేలుపై నమోదైంది.  నేపాల్‌లోని ఎవరెస్టు బేస్‌క్యాంప్‌లో ఉన్న భారత ఆర్మీ బృందం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు ఎవరెస్టు పర్వతారోహకుల ప్రారంభస్థానమైన నామ్‌చేబజార్‌ పట్టణానికి సవిూపంలో ఉన్నారు. నేపాల్‌లో తాజాగా 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప కేంద్రం నామ్‌చేబజార్‌కు సవిూపంలో ఉంది. న భూకంపం తీవ్రతకు పశ్చిమ్‌ బంగ రాష్ట్రంలోనూ స్వల్పంగా భూమి కంపించింది. దీంతో కోల్‌కతా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. భూప్రకంపనల కారణంగా దిల్లీ మెట్రో సేవలకు కూడా అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. భూకంపం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తమ వారి వివరాలు తెలుసుకునేందుకు నేపాల్‌లోని భారత దౌత్యకార్యాలయంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్‌ నంబర్లు: 977 985-110-7021, 977 985- 113-5141గా ప్రకటించింది.

కోస్తాంధ్రలో ఉలిక్కిపడ్డ ప్రజలు

భూప్రకంపనలతో ఆంధ్రప్రదేశ్‌ ఉలిక్కిపడింది. రెండు వారాల క్రితం వచ్చిన భూప్రకంపనల్ని మరువక ముందే మరోసారి భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  కోస్తాంధ్ర జిల్లాలు గజగజా వణికాయి. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. కృష్ణా జిల్లా విజయవాడ, గొల్లపూడి; విశాఖపట్నంలోని మాధవధార, మురళీనగర్‌; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తీరప్రాంతాల్లోని రాజుల్లంక, తూర్పు తాళ్ల, ఆకివీడు; తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన పట్టణాలైన కాకినాడ, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఈ ఘటనతో కాకినాడలో దుకాణాలు మూసివేశారు. ప్రజలు భయంతో భవనాలు వీడి ఆరుబయట ఉండడానికే ఇష్టపడుతున్నారు. భూకంపం తీవ్రతకు విశాఖ నగరంలోని మాధవధార, మురళీనగర్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ప్రధాని అత్యవసర సమావేశం

నేపాల్‌లో భూకంపం ప్రభావంపై భారత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. నేపాల్‌ భూకంప ప్రభావంతో భారత్‌లోనూ పలు చోట్ల తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. దీంతో మోదీ పలు శాఖల అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. సహాయక చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై సవిూక్షించారు. భూకంపంపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన సహాయక చర్యలు అందించాలని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రధాని మోదీని కలిసి పరిస్థితి గురించి వివరించారు. భూకంపం వార్త తెలిసిన వెంటనే ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు.  తక్షణమే  సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున భూమి కంపించిందని, అపార నష్టం సంభవించే అవకాశాలున్నాయని ఢిల్లీ  డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. నేపాల్‌కు  ఎలాంటి సహాయాన్నయినా అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్‌  హావిూ ఇచ్చారు. దేశంలోని సంభవించిన భూకంపం ప్రమాదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను అప్రమత్తం చేశామని కేంద్రమంత్రి చెప్పారు.భారత ¬ం మంత్రిత్వ శాఖ ఎన్డీఆర్‌ఎప్‌ సహాయ బృందాల్ని అప్రమత్తం చేసింది. నేపాల్‌లోని భారత రాయబారి రణజీత్‌ రే ¬ం శాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్‌కు సమాచారం అందించడంతో వారు ఈ మేరకు సహాయక బృందాలు సంసిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.  అయితే ఈ ప్రకంపనల గురించి ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ అన్నారు. అంతా ప్రశాంతంగా ఉండాలని అధికారులు ఇప్పటికే పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆయన ట్విట్టర్‌లో ఈ సందేశాన్ని ఉంచారు. మధ్యాహ్నం సంభవించిన నేపాల్‌ భూకంప ప్రభావంతో ఉత్తరప్రదేశ్‌లోనూ తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ లక్నోలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఆయనతోపాటు ఆ సమావేశానికి హాజరైన నేతలు, అధికారులు అందరూ భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. తమిళనాడులోని చెన్నై నగరంలో కూడా స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం గురించి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.అసోం రాష్ట్రంలోనూ భూకంప తీవ్రత ఎక్కువగానే ఉంది. అసోంలో రిక్టర్‌స్కేలుపై 7.3 తీవ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు నిమిషం పాటు భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు నష్టంపై ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.