వనజాక్షికి కంటి తుడుపు

3

– తహసీల్దార్‌ కథ కంచికి

– సర్ది చెప్పిన చంద్రబాబు

– సరె అన్న ఏపీఎన్‌జీవోలు

హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి):

కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి వివాదం కంటితుడుపుగా ముగిసింది. మహిళపై దాడి జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చర్చించి రాజీకి కుదర్చడం గమనార్హం. దీనిని ఇంతటితో వదిలేయాలని, ఇంకా రచ్చ చేయడం తగదని సూచించినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు సిఎం ఇచ్చిన హావిూతో తమ ఆందోళన విరమస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం తొలుత సిఎంను ఆయన నివాసంలో కలిసిన రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అరెస్టుకు డిమాండ్‌ చేశారు. చింతమనేని కూడా సీఎంను కలిసి తన వాదనను వినిపించారు. ఇరువురి వాదనలు విన్న సీఎం చంద్రబాబు మహిళా ఉద్యోగిపై దాడి సబబు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు… దీన్ని ప్రోత్సహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో దాడి వ్యవహారంపై విచారణ జరిపించి…ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హావిూ ఇవ్వటంతో రెవెన్యూ ఉద్యోగులు శాంతించారు. మొత్తానికి ఇసుక బాగోతంపై సీఎం చంద్రబాబుతో రెవెన్యూ నేతలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ వివాదంపై సీనియర్‌ ఐఏఎస్‌తో కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని, సరిహదుద్దలపైనా నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. ఏలూరులో తహసీల్దారు వనజాక్షిపై కేసులు ఎత్తివేయాలని సీఎం ఆదేశం జారీ చేశారు. తహసీల్దారుపై దాడి సమయంలో ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపైనా ఐఏఎస్‌ కమిటీ విచారణ జరపనుంది. ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులపై దాడులు పునరావృతం కాకుండా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం భరోసా మేరకు ఆందోళన విరమించి సోమవారం నుంచి విధులకు హాజరు కానున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు ప్రకటించారు. సీఎంతో భేటీ అనంతరం ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి విూడియాతో మాట్లాడుతూ…. మొత్తం ఘటనపై ముఖ్యమంత్రి విచారణ చేయిస్తామన్నారని చెప్పారు. సీఎం న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. అందుకే ఇక మరింతగా ఆందోళనకు దిగరాదని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.

ముసునూరు మండలం తహశీల్దార్‌ వనజాక్షి పై దాడి జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాజీ చర్చలు జరగడంపై సర్వతత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మార్వోపై దాడి చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ను అరెస్టు చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.అయితే బాదితురాలు వనజాక్షి, ఆరోపణలకు గురైన ప్రభాకర్‌ ఇద్దరూ చంద్రబాబు వద్దకు విూటింగ్‌ కు రావడం విశేషం. వీరితో పాటు రెవెన్యూ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, విద్యాసాగర్‌ లు కూడా హాజరయ్యారు.ఏ రకంగా రాజీ కుదిరిందన్నది ఆసక్తికరంగా ఉంది. అయితే గతంలో ఇద్దరు ఫ్యాక్షనిస్టు నేతలను పిలిచి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజీ చేస్తే దానిని పెద్ద ఎత్తున చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ¬దాలో ఉన్న చంద్రబాబు ఇసుక మాఫియా ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేని కేసులో నుంచి రక్షించడానికి గాను వనజాక్షితో సంప్రదింపులు జరపడంపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  కృష్ణాజిల్లాలో సంచలనం సృష్టించిన ఇసుక బాగోతం, ఎమ్మార్వోపై దాడి వ్యవహారం వివాదాన్ని పరిష్కరించేందుకు సీఎం వారిని పిలిచారని సమాచారం.