వరంగల్‌లో పనిచేసినందుకు గర్వంగా ఉంది: ఆమ్రపాలి
వరంగల్,ఆగస్ట్31(జనం సాక్షి): చారిత్రక వరంగల్‌లో సమర్థవంతంగా పనిచేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా వెళ్లిన ఆమ్రపాలికి గురువారం రాత్రి ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఏకశిలా చిల్డన్స్ పార్కులో జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ.. కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లులో పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మొదటి కలెక్టర్‌గా పనిచేసిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. అధికారుల సహకారంతో 22 నెలల పాటు ఉత్సాహంగా, ప్రణాళికాబద్దంగా పనిచేశానన్నారు. నగరంలో పనిచేసిన కాలంలో వివాహం చేసుకోవడం తన జీవితంలో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.