వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రాజయ్య

2

న్యూఢిల్లీ/వరంగల్‌,అక్టోబర్‌31(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను పార్టీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ద్వివేది శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. తొలుత దీని కోసం మాజీ ఎంపీలు వివేక్‌, రాజయ్య, సర్వే సత్యనారాయణ పేర్లను పరిశీలించింది. పార్టీ చివరకు రాజయ్య వైపు మొగ్గు చూపింది. పెద్దపల్లి మాజీ ఎమ్‌.పి వివేక్‌ ను రంగంలో దించడానికి పార్టీ ప్రయత్నించింది. కాని అందుకు ఆయన అంగీకరించకపోవడంతో రాజయ్య పేరు ఖరారు అయింది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పోటీచేస్తారా అన్న ప్రచారం జరిగినా, అంతిమంగా స్థానికంగా ఉన్న నేతగా మాజీ ఎంపి రాజయ్య వైపే మొగ్గు చూపింది. 2009 లో ఈయన గెలుపొందారు.2014 లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది కడియం శ్రీహరి పై పోటీచేసి సుమారు 3.95 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలంగాణుద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. మొత్తంగా ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనతో  రాజకీయ చైతన్యం కలిగిన ఓరుగల్లులో రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి. కాంగ్రెస్‌,టిఆర్‌ఎస్‌, లెఫ్ట్‌ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక మిగిలింది ఎన్‌డిఎ కూటమి మాత్రమే. బిజెపిపోటీచేస్తున్నందున అభ్యర్థి ఎవరన్నది తెలియాల్సిఉంది. ప్రస్తుత డిప్యూటి సిఎం కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. వరంగల్‌ ఎంపి టికెట్‌ దక్కించుకొనేందుకు అన్ని పార్టీలకు చెందిన అశావహులు ప్రయత్నాలుచేశారు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో పలువురు ప్రయత్నాలు చేశారు. ఈ సారి అన్ని పార్టీలో నాన్‌లోకల్‌ అభ్యర్ధుల పేర్లే తొలుత ప్రముఖంగా వినిపించాయి. నామినేషన్లకు నాలుగు వరకు గడువు ఉండడంతో  జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ నుండి వరంగల్‌ ఎంపీగా  కడియం శ్రీహరి భారీ మెజార్జీ తో విజయం సాధించారు. అయితే కేసీఆర్‌ మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో వరంగల్‌ జిల్లాకు చెందిన స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. శాఖలో జరిగిన అవినీతి, వివిధ రాజకీయాల కారణంగా రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో వెంటనే రాజయ్య స్థానంలో ఇదే జిల్లాకు చెందిన ఎంపీ కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే కడియం జూన్‌లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. వెంటనే కడియం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో వరంగల్‌ లోక్‌ సభ స్థానానికి ఎన్నికలు తప్పనిసరయ్యాయి. ఆరు నెలలలోపు వరంగల్‌ పార్లమెంట్‌కు ఎన్నికలు నిర్వహించాలి. దీంతో పార్టీలన్ని వరంగల్‌ పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం సన్నాహాలు చేసాయి. టిఆర్‌ఎస్‌ దూకుడు కళ్లెం వేయాలంటే వరంగల్‌ లోక్‌ సభ ఉపఎన్నికల్లో ఆ పార్టీ ని ఓడించాలని అన్ని రాజకీయ పార్టీలు కసితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇప్పటికే రంగంలోకి దిగి అనేక కార్యక్రమాలను చేపట్టింది.  పార్లమెంట్‌ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజవర్గాల్లో కార్యకర్తల సమావేశాన్ని సైతం నిర్వహించింది. కాంగ్రెస్‌ పార్టీతో పాటు  కేంద్రంలో అధికారంలోఉన్న బిజెపి పార్టీ సైతం కాషాయం జెండా ఎగరవేయాలని జోష్‌ విూద ఉంది. కొద్ది రోజుల క్రితం ఆపార్టీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనేక కార్యక్రమాలుచేపట్టారు. అయితే బిజెపి ఒకడుగు ముందుకేసి బిజెపి ఆభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి ఖయమని ప్రచారం చేస్తుంది.  ఇక వామపక్షాలు అభ్యర్థిని నిలబెట్టాలా… లేక ఎవరికైనా మద్దతూ ఇవ్వాలా అనే ఆలోచనలో గద్దర్‌ను రంగంలోకి దింపాలని చూశారు. ఆయన వెనకడుగు వేయడంతో గాలి వినోద్‌ను దింపారు.  ఇక అధికార టీఆర్‌ఎస్‌  ఎట్టి పరిస్థితుల్లో వరంగల్‌ స్థానాన్ని వదులుకోవద్దని గట్టిగా ప్రయత్నిస్తుంది. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం కిందికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు ఎస్పీ రిజర్వు కాగా ఐదు జనరల్‌ స్థానాలు. ఇందులో పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌ రావు మినహా మిగితా ఆరుగురు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌కు ఉన్నారు. అయితే 2009కి ముందు జనరల్‌ స్థానంగా వరంగల్‌ పార్లమెంట్‌  2009 ఎన్నికల నుండి ఎస్సీకి రిజర్వు చేశారు. దీంతో ఆయా పార్టీ సమర్దవంతమైన నాయకుడితో పాటు మాదిగ సామాజిక వర్గంకు చెందిన వారికే టిక్కెట్‌  కేటాయించాలని అన్ని పార్టీలు భావించాయి.  జిల్లాకు చెందిన వారిలో మాజీ ఎంజి రాజయ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఇంచార్జీ రాజారాపు ప్రతాప్‌ పేర్లు తెరపైకి రాగా, నాన్‌ లోకల్‌ నుండి ఎక్కువగా పేర్లు నిపిస్తున్నాయి. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌, మల్కాజిగిరి మాజీ ఎంపి సర్వే సత్యనారాయణతో పాటు పార్లమెంట్‌ స్పీకర్‌ విూరాకుమారి పేర్లు తెరపైకి వచ్చాయి. జిల్లా కాంగ్రెస్‌ నేతల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. చివరకు ఎఐసిసి రాజయ్యపేరునే ఖరారు చేసింది.  కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే బిజెపి పరిస్థతి మరోలా ఉంది. ఈ పార్టీ కూడా నాయకుల్లో సఖ్యత లేదు. ఎవరికి వారే తమ రాజకీయాలను చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని జోష్‌తో వరంగల్‌ బై ఎలక్షన్లలో కాషాయం జెండాను ఎగరవేయాలని తహతహ లాడుతుంది. ఈ పార్టీ సమర్థవంతమైన నాయుకులు లేరు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రామగళ్ల పరమేశ్వర్‌ కు ఆశించిన స్థాయిలో ఓటింగ్‌ రాలేదు. ఆభ్యర్థి కష్టంగా మారాడు. అయితే బిజెపి తెలివగా పార్టీ నాయకులను కాకుండా వివిధ రంగాల్లో ప్రముఖులై పార్ట సానుభూతిపరులను పోటీలో ఉంచాలని యోచిస్తుంది.కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ దయాకర్‌, రిటైర్డ్‌ డీఎస్పీ రాంచందర్‌, ఇరిగేషన్‌ శాఖలో ఇంజనీర్‌ గా పనిచేస్తున్న రామకృష్ణను పోటీలో ఉంచాలని సన్నాహాలు చేస్తుంది. రాజకీయలాకు సంబంధంలేని వారిని నిలబెడితే ఇతర పార్టీలకు విమర్శించే అవకాశం ఉండకపోవడంతోపాటు ప్రజల్లోకి సులభంగా వెళ్లవచ్చేనే ఆలోచనలో ఉంది. మొత్తంగా ఇప్పుడు అభ్యర్థుల ఖరారు కావడంతో ఇక ప్రచారార్భాటమే మిగిలింది.