వరదప్రాంతాల్లో జోరుగా సహాయక చర్యలు: సిఎం నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌ ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సంలో ఒడిశా విలవిలలాడుతోంది. గంజాం, గజపతి, రాయగడ తదితర జిల్లాల్లో వరదలు కొనసాగుతున్నాయి. ఊర్లు ఏరులయ్యాయి. చాలా గ్రామాల్లో నడుం లోతు నుంచి నిలువెత్తున నీళ్లు నిలిచాయి. దీంతో, ప్రజల గోడు వర్ణనాతీతంగా ఉంది. చుట్టూ వరద కమ్మేయడంతో కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదు. వరద పీడిత ప్రాంతాల్లో నేవీ సహాయక చర్యలు చేపట్టింది. ప్రధానంగా చేతక్‌ హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు జారవిడుగుస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గంజాం, గజపతి, రాయగడ జిల్లాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. వరదల పరిస్థితిని అంచనా వేశారు. సాయంత్రం భువనేశ్వర్‌ లో సవిూక్ష నిర్వహించి, బాధితులకు నష్టపరిహారంపై ప్రకటన చేస్తామన్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కేంద్రాన్ని సాయం కోరతామని చెప్పారు. సహాయ, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని నవీన్‌ తెలిపారు.