వరదప్రాంతాల్లో పర్యటించిన మంత్రి,కలెక్టర్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలోని వరద ప్రాంతాల్లో మంత్రి జోగు రామన్న పర్యటించారు. మున్సిపల్‌ పరిధిలోని పదిహేను వార్డులో కాలినడకన తిరుగుతూ వరద బాధితులను పరామర్శించాడు. శాంతినగర్‌ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ దివ్యాదేవరాజన్‌ వరద ప్రభావిత గ్రామాలను సందర్శించారు. బాధితులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల ప్రజల కోసం ఆదిలాబాద్‌, జైనథ్‌, బేల, ఇచ్చోడ మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి భోజనం, ఇతర సౌకర్యాలను కల్పించారు. కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్‌ 18004251939 ఏర్పాటు చేశారు. మండలానికో ఓ ప్రత్యేకాధికారిని నియమించారు. మరో రెండురోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. పెన్‌గంగా పరీవాహక ప్రజలను అప్రమత్తం చేశారు. వరద బాధితులను ఆదుకుంటామని మంత్రి జోగు రామన్న హావిూ ఇచ్చారు.