వరదప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి
ఆదిలాబాద్,ఆగస్ట్21(జనం సాక్షి): వరద పరిస్తితులును ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులతో అన్నారు. అతివృష్టితో జిల్లాలో అన్నదాత నష్టపోవ డం విచారకరమని,తహసీల్, వ్యవసాయ శాఖల జాయింట్ సర్వే అనంతరం బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయని సవిూప గ్రామాల ప్రజలను అధికారులు వాగులు దాటకుండా చూడాలన్నారు. గ్రామాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సవిూక్షించి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలని సూచించారు. అలాగే గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. వరదబాధితుల పూర్తి వివరాలను అడిగితెలుసుకున్నారు. నష్ట వివరాల కోసం సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. బావుల నీరు తాగకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని చేతిపంపుల నీరు తాగేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రాజెక్టులతో ముంపు ప్రమాదం ఉంటే గ్రామాల ప్రజలను అప్రమతం చేయాలన్నారు. ఇదిలావుంటే గోదావరి వరద ఉధృతి తీవ్రంగా ఉందని తెలిసినా కొందరు స్నానాలకని నీటిలోకి దిగుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని స్థళానిక అధికారులు అన్నారు. నీరు పారుతున్నప్పుడు దాని వేగాన్ని అంచనా వేయలేమన్నారు. ఒక్కోసారి ఎగువ ప్రాంతం నుంచి ఒక్క ఉదుటన భారీగా వరద నీరు వస్తే ఈత వచ్చిన వారు కూడా కొట్టుకుపోతారన్నారు. ప్రాజెక్టులోనికి వెళ్లేందుకు నీటిపారుదల శాఖ అధికారులు అనుమతిలేదని, బలవంతంగా దిగినవారిపై ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టే ఆస్కారం ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.