వరద ఉధృతికి కొట్టుకు పోయినకేజ్‌ కల్చర్లు

సుమారు 4కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా

నిజామాబాద్‌,జూలై13(జనంసాక్షి): నీలి విప్లవంలో భాగంగా ఏర్పాటు చేసిన కేజ్‌ కల్చర్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దీంతో రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరినదికి
పోటెత్తిన వరద ఉధృతి ఫలితంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ’నీలి విప్లవం’పథకంలో భాగంగా ప్రభుత్వం సహకారంతో నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మొత్తం ఎనిమిది కేజ్‌ కల్చర్‌ యూనిట్లు బుధవారం ఉదయం పూర్తిగా కొట్టుకుపోయాయి. శ్రీరాంసాగర్‌ నుంచి వస్తున్న వరద ఉధృతిని తట్టుకోవడానికి ఒకేసారి 55గేట్లు ఎత్తివేసి భారీ మొత్తంలో నీటిని దిగువకు వదిలిపెట్టడంతో వరద ఉధృతిని తట్టుకోలేక… మత్స్యకారులు నిర్వహిస్తున్న మొత్తం 80 కేజేస్‌ కొట్టుకుపోయాయి. దాదాపు 100 టన్నుల చేపలు వరదలో కొట్టుకుపోయాయినట్లు వారు చెబుతున్నారు. వీటితో పాటు నాలుగు మోటారు బోట్లు, సుమారు ఆరు టన్నుల నిలువ చేసిన చేపలు దాణా, ప్రాజెక్టు మధ్యలో ఏర్పాటు చేసిన నీటిపై తేలియాడే షెడ్‌, చేపలు పెంపకానికి ఉపయోగించే వలలు, అనేక లైవ్‌ జాకెట్లు తదితర సామగ్రి వరదలో కొట్టుకుపోయాయి. మొత్తం రూ. 4 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేజ్‌ కల్చర్‌ నిర్వాహకులు చెబుతున్నారు.