వరద ఉధృతి తగ్గినా కోలుకోని నిర్వాసిత మండలాలు
నీటిలోనే జీవినం సాగిస్తున్న బాధితులు
సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు
పోలవరం,జూలై120(జనంసాక్షి):గోదావరి, శబరి నదుల ప్రవాహ ఉధృతితగ్గినప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత మండలాలైన విఆర్.పురం, చింతూరు, ఎటపాక, కూనవరంలో గ్రామాలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. పోలవరం నిర్మాణంలో లోపాలే కారణమని అంటున్నారు. అయితే, నదులు శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో సుమారు 45 వేల మంది ముంపునకు గురై నిరాశ్రయులుగా మారారు. ఎగువున కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగిన గోదావరి పోలవరం నిర్వాసిత మండలాలను నిలువునా ముంచేసింది. గతంలో ఎంత వరద వచ్చినా
త్వరగానే తగ్గిపోయేదని, కానీ గత వారం రోజులుగా వరద నిలిచి ఉందని, తగ్గడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఉందని ఎటపాక వాసులు వాపోయారు. వరద ప్రభావం ఇంతలా పెరగడానికి ప్రణాళిక లేని పోలవరం నిర్మాణమే కారణమని బాధితులు అంటున్నారు. గుట్టలపైకి చేరి భయానక పరిస్థితుల్లో బతుకుతున్నామని, ప్రభుత్వం నుంచి అందే సహకారం అంతంత మాత్రంగానే ఉందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం తప్ప ఇంకేం సహాయం అందలేదు. ముంపు వల్ల ఎటూ వెళ్లలేని పరిస్థితి. అడవుల్లోని డొంక బాటలు మూసుకుపోయాయి. ఏం తిని బతకాలి’ అని విఆర్.పురం మండలం రేఖపల్లికి తరలివచ్చిన బాధితులు వాపోతున్నారు. సిఎం ప్రకటించిన సాయమేదీ తమకు అందలేదని తెలిపారు.మరోవైపు రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం చింతూరులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. చింతూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 పునరావాస కేంద్రాల్లో బాధితులు తలదాచుకుంటున్నారు. గతంలో ముంపు మండలాల్లో పని చేసి పిఒగా సేవలందించిన ఆకుల వెంకటరమణను, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్‌ను ముంపు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వరదపోటు తగ్గిందని, పారిశుధ్య పనులు ప్రారంభిస్తామని వారు తెలిపారు. మరోవైపు దాతలు ముందుకు వచ్చి సాయం అందచేస్తున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లోని ముంపుకు గురైన లంక గ్రామాలు, పునరావాస కేంద్రాలకు నిత్యావసర సరుకులను పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ స్వయంగా అందజేశారు. వరదల కారణంగా అల్లాడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పునరావాస శిబిరాల్లో ఉన్న బాధితులకు అరకొర ఆహారం సరఫరా అవుతోందన్నారు. దీంతో లంక గ్రామాల బాధితులు శిబిరాలకు వెళ్లడం లేదన్నారు. ఇక పునరావాస కేంద్రాలకు వెళ్తే ఉన్న వస్తువులు వరదల్లో కొట్టుకుపోతాయని భయంతో కొంతమంది ఇళ్లలోనే ఉండిపోతున్నారని, అలాంటి వారికి ఆహారం, తాగునీరు అందించాల్సి ఉందన్నారు. అధికారులు వారానికి ఒకసారి అందించే ఆహార పొట్లాల కోసం కొట్లాడుకునే పరిస్థితి వస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.