వరద తగ్గినా ఇంట్లోకి అడుగు పెట్టలేని దుస్థితి
బురదలో కూరుకుపోయిన అనేక ఇళ్లు
కొట్టుకుపోయిన పశువుల కోసం వెతకులాట
ఇంట్లో సామాన్లు చెత్త కుప్పలా మరిన వైనం
కాకినాడ,జూలై23(జనంసాక్షి): గోదావరి జిల్లాలను కదిలిస్తే కన్నీటి సంద్రాలు కనిపిస్తున్నాయి. సర్వం కోల్పో యిన ప్రజలు దీనావస్థలో ఉన్నారు. సొంతూళ్లకు చేరుకుని తమగూడు చూసుకుని బోరుమంటున్నారు. ఊహించని రీతిలో వచ్చిపడిన వరద శోకాన్ని మిగిల్చింది. వరద తగ్గినప్పటికీ ఇళ్లల్లోకి అడుగుపెట్టే పరిస్థితి లేదు. వరద ఉధృతికి ఇళ్లు నేలకొరిగి, పైకప్పులు కొట్టుకుపోయి, ఇళ్లల్లో నడుములోతు బురద పేరుకు పోయి ఇలా ఊళ్లన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. ఇళ్లల్లో తడిసి ముద్దయిన సామాగ్రి ఎందుకుపనికి రాకుండా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. టీవీలు, కూలర్లు, ఫ్యాన్‌లు తడిచి ఎందుకు పనికి రాకుండా పోయాయి. కట్టుబట్టలతో పునరావాసానికి తరలివెళ్లి ఇప్పుడు వరద తగ్గాక ఇంటికి వచ్చి చూస్తే ఆ కట్టుబట్టతో మిగిలిన కుటుంబాల రోదన అంతాఇంతా కాదు. ఈ నష్టాన్ని ఎలా పూడ్చు కోగలమంటూ లబోదిబోమంటున్నారు. కోళ్లు, మేకలు ఇతర పశువులు అడ్రస్ లేకుండా పోయి వరద నష్టాన్ని రెట్టింపు చేశాయి. వాటి జాడకోసం రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. భారాన్ని భాదని మోసుకుంటూ ఇళ్లల్లో పేరుకుపోయిన బురదను తొలగించే పనిలో బాధితులు నిమగ్నమయ్యారు. సాయమంటూ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 వేలు తమకు జరిగిన నష్టాన్ని ఏమాత్రం తీర్చగలదని బాధితులు పెదవి విరుస్తున్నారు.
గోదావరికి వరదలు వచ్చి పంట పొలాలు ముంపుబారిన పడిన నేపధ్యంలో ఆ పంటలన్నీ కుళ్లిపోవడంతో వరదనీరు తగ్గుముఖం పడుతుండడంతో నష్టాలు తేలుతున్నాయి. రావులపాలెం మండలంలోని గౌతమి, వశిష్ఠపాయల నదీపరివాహక ప్రాంతంలోని లంకపొలాలన్నీ వరదనీటితో ముంచెత్తాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడి ప్పుడే పంటపొలాలు తేలుతున్నాయి. లంక పంట పొలాల్లో సాగుచేసిన మునగ, బొప్పాయి, కూరగాయల పాదులు, ఉద్యా నపంటలు పూర్తిగా నీటమునగడంతో కుళ్లిపోతున్నాయి. నేటివరకు కాగితరూపంలో లెక్కలే తప్ప అధికారులెవరూ పంటనష్టనమోదుకు చర్యలు తీసుకోకపోవడంతో రానున్న రోజుల్లో సాగు చేసేదెలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైనతేయ వరద నీరు తగ్గి పలు ఇళ్లు కుప్పకూలుతున్నాయి. బోడసకుర్రు పల్లిపాలెంలో ఆరు ఇళ్లు నేలమట్టం కాగా మరికొన్ని ఇళ్లు ఒరిగిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కుమ్మరికాల్వ కౌశిక డ్రెయిన్ పొంగి అల్లవరం బుడంపేటలో 60 ఇళ్లు, సడక్‌రోడ్డు సిద్దినవారి మెరకలో 15 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. గోపాయిలంక అవుట్‌ఫాల్ స్లూయీస్ తలుపులు తెరుచుకోక ఈముంపు తగ్గడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అల్లవరం ఆర్‌అండ్‌బీ రోడ్డుపై తూరలు కుంగి ప్రమాదం పొంచి ఉంది. గోదావరికి వరద తీవ్రత తగ్గుముఖం పట్టి నప్పటికీ లంక గ్రామాల ప్రజలకు పాట్లు తప్పడంలేదు. అప్పనపల్లి ఉచ్చులవారిపేటకు వెళ్లే రహదారిలో గల కాజ్ వేపై వరద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండడంతో వాహన దారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఇంకా మోకాలుదాటి వరద ప్రవహిస్తుంది. అప్పనపల్లి కాజ్‌వేపై కూడా ఇంకా వరదనీరు ప్రవహిస్తుం డడంతో పడవ ప్రయాణాలు తప్పడం లేదు, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో వరద ప్రభావానికి రోడ్లన్నీ ధ్వంసమై రాళ్లు లేచిపోయి అధ్వానంగా తయారయ్యాయి. పల్లపు ప్రాంతాల్లో గల కాయగూరల పాదులు ఇంకా వరద నీటిలోనే తేలుతున్నాయి. పదిరోజుల పాటు వరద నీటిలో మునిగి ఉండడంతో తమకు అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాడబోది విూడియం డ్రెయిన్ పొంగి పొర్లడంతో ఆదుర్రు, పాశర్లపూడిలంక, బాడిలంక ప్రాంతాల్లోని డ్రెయిన్ పక్కనగల నివాస గృహాలన్నీ ముంపు బారినపడ్డాయి. మామిడికుదురులోని ఎస్టీ కాలనీలోకి పక్కనేఉన్న మురుగు కాల్వలో నీరు చేరడంతో కాలనీ మురుగుమయమైంది.