వరద భారతం

Floods_20150802.jpg   ఉత్తర, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో పోటెత్తిన వరదలు
ఢిల్లీ ఆగస్టు 2 (జనంసాక్షి) :
ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు బీభత్స సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో జనం అతలాకుతం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం, జార్ఘండ్‌, ఒడిస్సా, మణిపూర్‌ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకే పరిమితమవుతున్నారు. వరద బాధిత రాష్ట్రాల్లో ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జవాన్లు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఉత్తరాది అతలాకుతలం
ఉత్తరాదిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొమన్‌ తుపాన్‌ ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, మణిపూర్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి చాండేల్‌ జిల్లాలో 20 మంది సజీవ సమాధి అయ్యారు. అటు పశ్చిమబెంగాల్‌లోనూ కుండపోతగా కురిసిన వర్షాలకు వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద తాకిడికి మిడ్నాపూర్‌ 60నెంబర్‌ జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. అటు కోల్‌కతాలోని పలు కాలనీల్లో మోకాల్లోతు నీరు ప్రవహిస్తోంది. ప్రజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ వాహనాలు సైతం వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది బాధితులు నిరాశ్రయులయ్యారు.
కుండపోతగా వర్షాలు
కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా గుజరాత్‌, రాజస్థాన్‌, పశ్చిమ్‌బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. కుండపోత వర్షాలకు గుజరాత్‌లో ఇప్పటివరకు 53 మంది చనిపోగా..మణిపూర్‌లో 25 మంది మృత్యువాత పడ్డారు. అటు హిమాచల్‌ ప్రదేల్‌లోనూ కొండచరియలు విరిగిపడి అనేకమంది మృత్యువాత పడ్డారు. పశ్చిమబెంగాల్‌లోని హౌరా జిల్లాలో భారీ వర్షాలకు ఇల్లు కూలి ఓ మహిళ మృతిచెందింది. 39 గ్రామాలు నీటమునగడంతో…దాదాపు 8వేల మంది గ్రామస్తులకు పునరావాస కేంద్రాలకు తరలించారు.
భారీ వర్షాలు.. బీభత్సం
ఇక దక్షిణమిజోరంలో భారీ వర్షాలకు చింప్టూతుయ్‌ నది పొంగిపొరలడంతో ఓ ఇల్లు కొట్టుకుపోయింది. అటు ఒడిస్సాలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాలు కుండపోత వర్షాల ధాటికి ప్రభావితం అయ్యాయి. కించూర్‌, జార్జ్‌పూంచ్‌, బాలాసోర్‌, మాదేవ్‌గంజ్‌, బాంకూర్‌ జిల్లాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గుజరాత్‌లో సబర్మతి నది ఉగ్రరూపం దాల్చడంతో..బనసకాంత , సురేంద్రనగర్‌ జిల్లాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జవాన్లను రంగంలోకి దింపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తుఫాను తోడుకావడంతో వెస్ట్‌ బెంగాల్‌తో పాటు ఒడిషా, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా భారీ వరదలు సంభవించాయి. హిమాచల్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లింది.
ఒక్క మణిపూర్‌ రాష్ట్రంలోని చందేల్‌ జిల్లా జైమూల్‌ గ్రామంలో కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి చెందారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాలో కొండచరియలు విరిగిపడడంతో ఇళ్లు కూలిపోయాయి. నిలువ నీడ లేక జనం రోడ్డున పడ్డారు. పరిస్థితిని అంచనా వేసి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జాతీయ రహదారులు మూసుకుపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది.
మరోవైపు… వెస్ట్‌ బెంగాల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు ఖాయమని వాతావరణశాఖ ప్రకటించడంతో జనం భయాందోళనకు లోనవుతున్నారు. ఈ రాష్ట్రంలో 12 జిల్లాల్లో లక్షలాది మంది వరద బాధితులుగా మారారు. వీరి కోసం 966 సహాయక శిబిరాలను ఏర్పాటుచేసింది.
బెంగాల్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలకు 40 మంది వరకు చనిపోయినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అలాగే, హౌరా, హుబ్లీ, బంకూర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. మిడ్నాపూర్‌ జిల్లాలో 60వ నెంబర్‌ జాతీయ రహదారి అక్కడక్కడ కోట్టుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.