వరల్డ్‌బ్యాంకుకు మీరూ వంతపాడారు కదా!

– మాపై విమర్శలెందుకు?
– ఇండియాస్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌ సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,నవంబర్‌ 4,(జనంసాక్షి): భారత్‌లో సులభతర వాణిజ్యంపై విపక్షాల విమర్శలను ప్రధాని మోదీ ఎండగట్టారు. వరల్డ్‌ బ్యాంకు జాబితాలో 142 నుంచి 100వ స్థానానికి భారత్‌ ఎదగడంపై వారికి  ఏమాత్రం అవగాహన లేనట్టు కనిపిస్తోందని చురకలు వేశారు. వరల్డ్‌ బ్యాంకుతో కలిసి పనిచేసిన వారే ఇప్పుడు ర్యాంకింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం ఏమిటని నిలదీశారు. ప్రవాసీ భారతీయ కేంద్రంలో శనివారంనాడు జరిగిన ‘ మాట్లాడుతూ మూడేళ్లలో ఈజీ బిజినెస్‌లో 42వ ర్యాంకును సాధించ గర్వకారణమని, ఇది ప్రభుత్వ సుపరిపాలనకు మంచి సంకేతమన్నారు. నాణ్యత, పారదర్శకతకు గీటురాయి అన్నారు. సులభ వాణిజ్యం అంటే.. జీవితాలు కూడా సులువుగా సాగడమని, ఇక తనముందు పెద్దగా లక్ష్యాలు ఏవిూ లేవని, తన ముందున్న ఏకైక లక్ష్యం.. దేశాన్ని, దేశ ప్రజల జీవితాలను మార్చడమే అని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో జీఎస్టీ అమలు చేయడం వల్ల వ్యాపారాలు మరింత సులువైనాయని ప్రధాని అన్నారు. జీఎస్టీలో అవసరమైన మార్పులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం, వరల్డ్‌ బ్యాంక్‌ కలిసి ఇంకా అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది నివేదికలో మరింత మెరుగైన ర్యాంక్‌ను సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిందేవిూ లేదని, అలా చేసి ఉంటే సులభతర వాణిజ్యంలో ఎప్పుడో కీలక పరిణామాలు చోటుచేసుకునేవని అన్నారు. కొందరు వ్యక్తులు ఉన్నారు. వారికి ర్యాంకుల ఎగుదల గురించి తెలియదు. అయితే వారు గతంలో వరల్డ్‌ బ్యాంకుతో మమేకమైన వాళ్లే’ అంటూ కాంగ్రెస్‌పై పరోక్షంగా మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. సులభతర వాణిజ్యానికి సంబంధించి 2004 నుంచి ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ఇస్తోందని, 2014 వరకూ ఎవరు అధికారంలో ఉన్నారో అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. సాధించిన ప్రగతిపై విమర్శలు చేయడానికి బదులు ‘నవీన భారతం’ నిర్మాణంలో కలిసి రావాలని విపక్షాలకు ప్రధాని హితవు పలికారు.  ఈనెల 1న రాహుల్‌ గాంధీ ఓ కార్యక్రమంలో వరల్డ్‌
బ్యాంకు ర్యాంకింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్‌టీతో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, ఇండియాలో వ్యాపారం చేయడం అంత సులువు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ర్యాంకింగ్‌ బాగుంటే సంతోషించేది ఒక్క అరుణ్‌ జైట్లీయేనని కూడా రాహుల్‌ వ్యంగ్యోక్తులు సంధించారు.