వరల్డ్ కప్: నాకౌట్‌లో ఒక్క మ్యాచ్ గెలవని దక్షిణాఫ్రికా, రేపు చరిత్రను తిరగరాస్తుందా..?
సిడ్నీ: మార్చి 18 (బుధవారం) దక్షిణాఫ్రికాకు చరిత్రలో ఓ మరుపురాని రోజుగా మిగిలిపోవాలని ఆ జట్టు కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రపంచ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. కానీ ఇంత వరకు ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేక పోడవం వారి దురదృష్టం. ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్ 2015ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని కెప్టెన్ డెవిలియర్స్ ఉన్నాడు. కానీ ఏం చేద్దాం. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా ఒక్క క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ కూడా గెలుపొందలేదు. 1992 నుంచి 2011 వరకు దక్షిణాఫ్రికా క్వార్టర్ ఫైనల్‌కు చేరినా ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. మార్చి 18న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో శ్రీలంకతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈసారి ఎలాగైనా శ్రీలంకపై గెలిచి తొలిసారి ఫైనల్స్‌కు అర్హత సాధించాలనే ఉత్సుకతతో దక్షిణాఫ్రికా జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా జట్టు 6 వరల్డ్ కప్స్ ఆడింది. 1992 నుంచి 2011 వరకు దక్షిణాఫ్రికా ఆడిన నాకౌట్ మ్యాచ్ ఫలితాలు పాఠకులకు ప్రత్యేకం. వరల్డ్ కప్: నాకౌట్‌లో ఒక్క మ్యాచ్ గెలవని దక్షిణాఫ్రికా, రేపు 1992 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి: ఈ మ్యాచ్‌లో 253 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో దక్షిణాఫ్రికా విజయావకాశాలపై వర్షం నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్ ఆస్టేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా మొట్టమొదటి సారి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీంతో దక్షిణాఫ్రికా ఒక బంతిలో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. 1996 వరల్డ్ కప్‌లో వెస్టిండిస్ చేతిలో ఓటమి: ఈ మ్యాచ్‌లో బ్రియన్ లారా వీరి పాలిట శాపమయ్యాడు. పాకిస్ధాన్‌లోని కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ దిగ్గజం బ్రియన్ లారా 94 బంతుల్లో 111 పరుగులు సాధించి, దక్షిణాఫ్రికా ను ఇంటికి పంపడంలో కీలకపాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాపై 19 పరుగుల తేడాతో వెస్టిండిస్ విజయం సాధించింది. 1999 వరల్డ్ కప్‌లో ఆస్టేలియా చేతిలో ఓటమి: ఈ వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజిలో దక్షిణాఫ్రికా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి నెంబర్ వన్ స్ధానంలో ఉంది. ఇక సూపర్ సిక్స్ స్టేజిలో మూడింట్లో రెండు మ్యాచ్‌లు గెలుపొందింది. సెమీ పైనల్స్‌లో ఆస్టేలియాలో తలపడటమే వారి వరల్డ్ కప్ ఆశలను నిరాశకు గురి చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి సందర్భంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ క్లూసినర్ రెండు ఫోర్లను బాదాడు. మ్యాచ్ విన్నింగ్ రన్ కోసం 11వ బ్యాట్స్‌మెన్ అలెన్ డొనాల్డ్ పరుగెత్తడంతో అతడిని ఆస్టేలియా రనౌట్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 213 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ సిక్స్ స్టేజిలో దక్షిణాఫ్రికాపై ఆస్టేలియా గెలుపొందడంతో ఆసీస్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 2007 వరల్డ్ కప్‌లో ఆస్టేలియా చేతిలో ఓటమి: మళ్లీ ఆస్టేలియా చేతిలోనే సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికాను 149 పరుగులకే ఆలౌట్ చేయడంలో ఆస్టేలియా బౌలర్లు మెక్‌గ్రాత్, షాన్ టైట్‌లు సఫలమయ్యారు. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్టేలియా 18 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. 2011 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి: ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని గ్రూప్ దశలో టాప్ స్కోరర్‌గా క్వార్టర్ ఫైనల్స్‌కు దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. అయితే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జాకబ్ ఓరమ్ 4, నాథన్ మెక్ కల్లమ్ 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.