వర్షం వస్తే నగర జీవనం అస్తవ్యస్థం

హైదరాబాద్‌,ఆగస్ట్‌28:

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు గుంతలమయమైన రహదారులు వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సర్కార్‌ ఇంతకాలం చోద్యం చూసిన దానికి దాఖలాలుగా గుర్తించాలి. అవినీతి అధికారులు లే ఔట్లకు పర్మిషన్లు ఇచ్చి, చెరువులను కబ్జా చేసినా పట్టించుకోని పాపానికి నాలాలు లేకుండా పోయాయి. దీంతో వర్షం వస్తే తప్ప చెరువులు ఎలా కబ్జాకు గురయ్యాయో తెలుసుకోలేక పోతున్నాం. ప్లాట్లు వేసి అమ్ముకున్న వారు ఆనందంగానే ఉన్నారు. కానీ కొనుక్కున్న పాపానికి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ వీటిపై తొలుత దృష్టి పెట్టినా తరవాత వాటిని పట్టించుకోలేక పోయారు. భారీ వర్షానికి కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, చింతల్‌, షాపూర్‌నగర్‌, బోయిన్‌పల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లోని ఏ గల్లీ చూసినా వరదనీటితోనే నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరదనీటిలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షాలకు హైదరాబాద్‌ మహానగరం చిగురుటాకులా వణికిపోవడం,కాలనీల్లోకి నీరు చేరడం అన్నది కేవలం నీరు పోవడానికి నాలాలు లేకుండా చేయడం వల్లనే అని గుర్తించాలి. నాలాల కబ్జాలను తక్షణం తొలగించాల్సి ఉంది. కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఈ కార్యం గట్టెక్కదు. పటాన్‌చెరు నుంచి ప్రధాన నగరం వరకు మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. అనేక కాలనీల్లోకి వరద నీరు పోటెత్తింది. శివార్లలోకుండపోత వర్షం కురవడంతో వందల సంఖ్యలో

అపార్ట్‌మెంట్లు నీట మునిగాయి. పలు చెరువులు అలుగు పారి సవిూప కాలనీలను ముంచెత్తడంతో ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు.వర్షంతోపాటు భారీగా వరద రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బేగంపేట, ఖైరతాబాద్‌ ప్రధాన కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, మెహిదీపట్నం, నాంపల్లి, ఆబిడ్స్‌, ఉప్పల్‌లతో పాటు కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, మలక్‌పేట, చాదర్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌లలో ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి బేగంపేట ప్రాంతంలో భారీగొయ్యి ఏర్పడింది. ఇవన్నీ ఎందుకు జరిగాయని ఆలోచన చేయాలి. నగరం ఎందుకు ఇంతగా ఛిద్రం అయ్యిందన్న విచారణ చేయాలి. ఎక్కడెక్కడ చెరువులు కబ్జాకు గురయ్యాయో, అవి ఎలా ప్లాట్లుగా మారాయో, దానికి బాధ్యులు ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలి. గతంలో జంటనగరాలు ఇంతగా దుస్థితికి చేరుకున్న దాఖలాలు లేవు. అమాయక ప్రజలను వంచించి చెరువులను కబ్జా చేసిన పాపానికి శిక్షఅనుభవిస్తున్నాం. తాజా వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ వరద ఎక్కడ ముంచెత్తు తుందోనన్న ఆందోళన నెలకొంది. ముంపు ప్రాంతాల్లో సర్వే చేసి ఎగువన చెరువులు తెగితే నీరు పోవడానికి కాలనీల్లో ఉన్నా నాలాలను గుర్తించాలి. నగరంలో ఎక్కడెక్కడ నాలాలు కబ్జా అయ్యాయో గుర్తించి వాటిని కాపాడాలి. అక్రమ లే ఔట్లతో ప్రజలను మోసం చేసిన బిల్డర్ల పనిపట్టాలి.