వర్షానికి కూలిన ఇండ్లు ఆదుకోవాలని బాధితుల వేడుకోలు
జగదేవ్ పూర్ ,జూలై 15 జనం సాక్షి
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయి నిరుపేద బాధితులు దిక్కు తోచని స్థితిలో రోడ్డున పడ్డారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు వర్షాల తాకిడికి గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ లో రెండు రాయవరంలో ఒకటి ఇటిక్యాలలో రెండు జగదేవ్ పూర్ లో ఒక ఇల్లు వర్షాల వల్ల కూలిపోయాయి. కాగా మండల కేంద్రమైన జగదేవ్ పూర్ గ్రామానికి చెందిన గుర్రాల చిన్నరాములు కు చెందిన ఇల్లు గతంలో నాలుగుసార్లు వర్షం కారణంగా కూలిపోయింది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అప్పు చేసి ఇల్లు పునర్ నిర్మించుకున్నప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ కూలిపోవడంతో కుటింబీకులు బోరున విలపిస్తున్నారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం స్పందించి ప్రకృతి బీభత్సాల వల్ల జగదేవ్ పూర్ మండలంలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.