వర్షాభావంతో పళ్లతోటలకు ముప్పు

చీనీతోటలను నరికేస్తున్న రైతులు
కడప,జూలై 23(జ‌నంసాక్షి): తీవ్ర వర్షాభావంతో వరి సాగు చేసే రైతులతో పాటు పండ్ల తోటల రైతులు విలవిలలాడుతున్నారు. తీవ్ర కరువుతో రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. జూలై మాసం గడిచిపోతున్నా వాన చినుకుజాడ లేదు. దీంతో చెరువులు, కుంటలు బీళ్లు వారాయి. బోర్లు అడుగంటాయి.   ఉన్న పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులకు ఆశగా వందలాది అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి జాడే లేదు. దీంతో చేసేది లేక పంటలను వదులుకుంటున్నారు.  చీనీ చెట్లు ఎండిపోతుండటంతో చేసేది లేక వాటిని నరికివేస్తున్నారు. బోర్లలో నీటిమట్టం ఇటీవల గణనీయంగా తగ్గింది. మరింత లోతుకు వేసి ఎలాగైనా తోటలను రక్షించుకునే ప్రయత్నంలో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తు ఆర్థికంగా నష్టపోతున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఎర్రగుంట్ల మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటాయి. వ్యవసాయ బోర్లతో పాటు తాగునీటి బోర్లలో కూడా నీటిమట్టం తగ్గడంతో ట్యాంకర్లతో నీటిని తోలుకుంటున్నారు. బోరులో కూడా నీరు రాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో చీనీ చెట్లను నరికివేస్తున్నాడు. వర్షాధార పంటలతో నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే రైతులు హార్టికల్చర్‌ వైపు వెళుతున్న సమయంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వారిని దెబ్బతీస్తున్నాయి.
అందని జాతీయ విపత్తు సాయం
ఇదిలావుంటే  2015 డిసెంబరులో సుమారు 20 రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురిసి రైల్వేకోడూరు నియోజకవర్గం అతలాకుతలమైంది. ఇటు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటలు నాశనమయ్యాయి. 2015 డిసెంబరు 10వ తేదీ కేంద్ర బృందం  రైల్వేకోడూరు వరదప్రాంతాలను పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. ఇంతవరకు జాతీయ విపత్తు కింద వరద తాకిడికి నష్టపోయిన ప్రాంతాలకు కేంద్ర సాయం అందలేదని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు అరటి, బొప్పాయి, పసుపు, కూరగాయలు, తమలపాకు తదితర తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండ్లతోటలకు అరకొర సాయం అందించారు. వరదలకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లింది.పండ్ల తోటలకు రూ.17 కోట్లు, బ్రిడ్జిలు, రోడ్లు, చెరువులు, కుంటలు సుమారుగా రూ.100 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనాలు వేసి పంపారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు పకృతి వైపరీత్యాలకు నాశనం అవుతున్నాయి. వర్షాలు వస్తే అతివృష్టి, లేకుంటే అనావృష్టిగా మారుతోంది. ఈ ఏడాది వర్షాలు లేక పంటలు ఎండుతున్నాయి. గతంలో పసుపు పంట పూర్తిగా వరదనీరు వచ్చి ముంచేసింది.