వర్షాలతో సింగరేణి ఉత్పత్తికి విఘాతం
నెలవారీగా ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశాలు
హైదరాబాద్,నవంబర్4 (జనంసాక్షి) : ఇటీవలి వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గు గనుల్లో తవ్వకాలకు అంతరాయం ఏర్పడడంతో నిరదేశిత ఉత్పత్తి లక్ష్యానికి గండిపడింది. అలాగే రవాణాకు ఆటంకం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో ఈ నెల నుంచి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. సింగరేణి భవన్‌లో ఆయన డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలతో ఇటీవల సవిూక్ష సమావేశం నిర్వహించారు. నవంబర్ నెల నుంచి వర్షాలు ఉండే అవకాశం లేదని, అందువల్ల వెనుకబడిపోయిన బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలతో పాటు నెలవారీ లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. ప్రత్యేక ప్రణాళికతో సింగరేణి మొత్తం విూద రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా సాధించేలా కృషి చేయాలన్నారు. రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కొత్త ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి అతి త్వరలో ప్రారంభం కావాలని ఆదేశించారు. ఒడిస్సాలో సింగరేణి చేపట్టిన నైనీతో పాటు కొత్తగా కేటాయించిన న్యూపాత్రపద బ్లాక్‌కు సంబంధించిన పనులను దశల వారీగా, ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.