వర్సిటీల్లో రాజకీయ జోక్యం నివారించాలి

C
– గ్రీన్‌హంట్‌ను నిలిపివేయాలి

– జెఎన్‌యు ప్రొఫెసర్‌ మనోరంజన్‌ మహంతి

వరంగల్‌,మార్చి27(జనంసాక్షి):దేశంలోని అన్ని యూనివర్సిటీలలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మనోరంజన్‌ మహంతి అన్నారు. ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్‌భవన్‌లో కమిటీఫర్‌ రీలిజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ (సిఆర్‌పిపి) ఆధ్వర్యంలో షహీద్‌ భగత్‌సింగ్‌, రాజ్‌గురు,సుఖ్‌దేవ్‌ల  సంస్మరణలో భాగంగా  నిర్వహించిన రాజకీయ ఖౌదీల హక్కుల పోరాట వారంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఉరిశిక్షను రద్దు చేయాలని, పది సంవత్సరాలు నింది ఖౌదీలందరినీ విడుదల చేయాలని,ఐపిసి నుండి రాజద్రోహం నేరంను తొలగించాలని, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను నిలిపివేయాలనే డిమాండ్‌లతో ఈ సభను నిర్వహించారు. ఈ సందర్బంగా మనోరంజన్‌ మహంతి మాట్లాడుతూ యూనివర్సిటీలలో గతంలోనే వాతావరణం పునరుద్దరించబడాలంటే పోలీసులను యూనివర్సిటీల నుండి బయటికీ పంపాలని డిమాండ్‌ చేశారు.యూనివర్సిటీలలో జరిగిన ఘటనల క్రమంలో విద్యార్థులపై కేసులు పెట్టకుండా ఉండాల్సిందని అన్నారు. ప్రభుత్వాలు, ప్రతిఒక్కరూ యూనివర్సిటీలలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.ప్రభుత్వాలు రాజకీయ జోక్యాలను విడనాడి దళితుల, ఆదివాసీల, వెనుకబడిన వర్డాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని అన్నారు.సభలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో దేశద్రోహంలాంటి కేసు పెట్టడం అంటే  రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ నేరం- శిక్ష అన్న అంశంపై మాట్లాడారు.  నేరం అనేది ఆదిమ సమాజ చరిత్ర నుండి పరిశీలిస్తే సొంత ఆస్తి భావన  ఉత్పన్నం నుండే ఉద్భవించిందని,సమాజ తీరుతెన్నులను బట్టే నేరం ఉద్భవిస్తుందని, అందుకు సమాజానిదే బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో దేశద్రోహం అనే పదానికి స్థానంలేదని, రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించినప్పటికీ దేశ ద్రోహం కేసులు పెట్టడం శోచనీయమన్నారు.దేశ ప్రజల గురించి, న్యాయం గురించి పోరాటం చేసేవాలంతా  రాజకీయ ఖైదీలుగా గుర్తించబడుతారని చెప్పారు.భావ స్వేచ్చను హరిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ జెఎన్‌యులో 47 మంది రాజకీయ ఖైదీలు ఉన్నారని, యూనివర్సిటీలను కేంద్రం తమ ప్రయోగశాలలుగా మార్చుకుంటున్నదని అన్నారు.ఢిల్లీ జెఎన్‌యులో, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీల్లో జరిగిన సంఘటనలు కేంద్రం కనుసన్ననలో సృష్టించ బడ్డాయని, ప్రత్యామ్నాయ రాజకీయత నిర్మాణంతోనే వాటికి అడ్డుకట్ట వేయవచ్చునని అన్నారు. ప్రతి వ్యక్తి రాజకీయ విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగంలో దేశ భక్తి అన్న పదానికి స్థానమేలేదని చెప్పారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల స్ఫూర్తితో అక్రమ నిర్భందాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.డిటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్‌ మాట్లాడుతూ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, మతోన్మాద వల్ల అభ్యుదయ, వామపక్ష, నిమ్నవర్గాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. సామ్రాజ్య వాద పెట్టుబడిని సమాజపు మూలమూలాల్లోకి ప్రవహింప చేసేందుకే ఈ అణచివేతలు జరుగుతున్నాయని చెప్పారు. రాజులు ఎవరూ ఉండని ప్రజాస్వామ్యంలో రాజద్రోహం గురించి చర్చించుకుంటున్నామంటే మనం ఉన్నది, ప్రజాస్వామ్యంలో లేమని అర్థమవుతున్నదని, కాబట్టి పాలకులు చెప్పె రాజద్రోహం పదాన్ని అంగీకరించడానికి వీల్లేదని అన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే, ప్రొఫెసర్‌ అన్వర్‌ఖాన్‌, అమరులు బందుమిత్రుల పోరాట కమిటీ కన్వీనర్‌ పద్మ, కుల వివక్ష పోరాట సమితి నాయకులు అభినయ్‌, జాన్‌, కుమారస్వామి తదితరులు మాట్లాడాగా, న్యాయవాదులు మార్క రామస్వామి, దశరథం, రవిందర్‌ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.