వలసలపై కఠినంగా వ్యవహరించాల్సిందే
అసోంలో విడుదలైన జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్‌ఆర్‌సి) పార్లమెంటు లోపల వెలుపల ప్రకంపనలు సృష్టిస్తోంది.. అక్రమ వలసలను గుర్తించే ఎంతో సున్నితమైన ఎన్‌ఆర్‌సి పక్రియ ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతకాలం ఓటుబ్యాంక్ రాజకీయాలలు నెరిపిన కాంగ్రెస్ తదితర పార్టీలు దీనిపై స్పష్టమైన విధానం అవలంబించ లేదు. తమ ఓట్ల కోసం బంగ్లా తదితర దేశాల నుంచి అక్రమంగా వలసవచ్చి ఇక్కడే తిష్ట వేసిన వారిని కాపాడుతూ వచ్చారు. అసోంలో గతంలో వచ్చిన ఉద్యమానికి ఇదే నాంది అయ్యింది. ఆ సమస్యలను పరిష్కరించడంలో నాటి పాలకులు విఫలమయ్యారు.
మొత్తం 3.3 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 40 లక్షల మంది దరఖాస్తులను తిరస్కరించారు. గత ఏడాది డిసెంబరులో విడుదల జేసిన తొలి ఎన్‌ఆర్‌సి ముసాయిదాలో కేవలం 1.9 కోట్ల మందినే పౌరులుగా గుర్తించారు. అసోం జనాభాలో 12 శాతం మందికి పౌరసత్వం నిరాకరించడం ద్వారా వలసదారులు సంక్య ఎంతగా పెరిగిపోయిందో దేశ ప్రజలను కలచివేసేదిగా ఉంది. ఇంతకాలం వీటిని అరికట్టడంలో అక్కడ పాలన చేసని కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. అక్రమ వసలసలకు వ్యతిరేకంగా 1970-80 దశకాల్లో పెద్దయెత్తున సాగిన హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో 1985లో అప్పటి రాజీవ్ ప్రభుత్వానికి, ఆందోళనకారులకు మధ్య 1985లో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలోని కీలకాంశాల్లో ఒకటి 1951 జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్‌ఆర్‌సి)ని తాజా పరచడం. 1971 మార్చి 24వ తేదీని కటాఫ్ డేట్‌గా నిర్ణయించారు. ఆ తరువాత అసోంలో ప్రవేశించినవారు తాము ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోవడానికి తగిన ఆధారాలు చూపాల్సి వుంటుంది. ఉల్ఫా, బోడోలాండ్ పోరాటాలు బలహీనపడ్డ తరువాత, ఉన్న స్థితిలోనే కుదురుకుంటున్న అసోంలో ఇప్పుడు ఈ పౌరచిట్టా వేదిక విూదకు వచ్చింది. స్వతంత్రం వచ్చాక మన పాలకుల వైఫల్యం గతం చిక్కుముడులు విప్పకపోగా, వారు అనేక కొత్త సమస్యలను సృష్టించారు. బంగ్లాదేశ్ యుద్ధం సమయంలోను, ఆ తరువాతా అక్కడి నుంచి అసోంకు వలసవెళ్లి ఉండిపోయిన వారి విషయంలో అసంతృప్తి రాజుకుని ఒక ఉద్యమంగా 1970 దశకం చివరలో మారింది. ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారనే దానితో పాటు, వలసదారులు కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ గెలుపోటములను నిర్ణయిస్తున్నారన్న ఆరోపణ కూడా తోడయింది. పౌరుల చిట్టా మార్చాలని జనంలో ఉన్న డిమాండ్‌ను పరిశీలించి ప్రభుత్వం జాబితా ప్రకటించింది. రాజీవ్ గాంధీ అసోం ఉద్యమనాయకులతో ఒప్పందం చేసుకోవడం, 1985 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో ఎజిపి అధికారంలోకి వచ్చి ప్రఫుల్ కుమార్ మహంత ముఖ్యమంత్రి కావడం జరిగాయి. 1971 తరువాత అసోంకు వచ్చిన వలస దారులను గుర్తించి వెనుకకు పంపడం ఒప్పందంలో ఒక ముఖ్యాంశం. ఆ గుర్తింపు పక్రియ దశాబ్దాలు కొనసాగి, ఇప్పుడు సుప్రీం కోర్టు నిమిత్తమాత్ర ప్రమేయంతో పౌరుల చిట్టా రూపం తీసుకుంది. దేశవిభజనల సమయంలో ప్రస్తు బంగ్లాదేశ్
తూర్పు పాకిస్థాన్‌గా ఉండేది. అది స్వతంత్రాన్ని కోరుతూ ఉద్యమిస్తున్న సమయంలో భారతదేశం ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. నాటి పాకిస్థాన్ పాలకులు తూర్పు పాకిస్థాన్‌పై భాషాసంస్కృతులతో సహా అనేక రంగాలలో అణచివేత సాగించారు. ఒకే మతానికి చెందినప్పటికీ, భాషలు వేరువేరు కావడంతో, తూర్పు పాకిస్థాన్‌లో నాడు భాషాజాతీయవాదం ఉద్యమాన్ని రగిలించింది. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో తూర్పు పాకిస్థాన్‌లోని బెంగాలీ హిందువులు, ముస్లిములు భారతదేశంలోకి పెద్ద ఎత్తున శరణార్థులుగా వచ్చారు. అంతిమంగా భారతదేశం సైనికంగా రంగంలోకి దిగడం, బంగ్లాదేశ్ అవతరించడం జరిగాయి. బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత శరణార్థులందరూ వెనుకకు వెళ్లలేదు. కొత్తగా ఆ దేశం నుంచి వలస
రావడం కూడా ఆగలేదు. పొరుగునే ఉన్న అసోంలోకి వలసలు సహజంగానే పెద్ద ఎత్తున జరిగాయి. భారతదేశంలోకి బంగ్లా శరణార్థుల రాకడ అన్నది లెక్కకు మిక్కిలి జరిగి స్థానికుల ఉనికిని ప్రశ్నించేదిగా సాగిపోయింది. పెద్ద ఎత్తున పరాయి ప్రజలు రావడం వల్ల అక్కడి వనరులపై ఒత్తిడి పెరగడం, అంతంత మాత్రంగా ఉన్న ఉపాధి అవకాశాలపై దాని ప్రభావం పడింది. అది ప్రజలలోని వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలకు, విద్వేషాలకు దారితీసింది. దీంతో అసోంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం వచ్చింది.
అసోం గణపరిషత్ ప్రయోగం విఫలమయిన తరువాత, ఆ రాష్ట్రంలో వివిధ ఆదివాసీ, స్థానిక తెగల నుంచి మిలిటెంట్ పోరాటాలు వచ్చాయి. ఈ దశలో అసోంలో ఇప్పుడు ఈ పౌరచిట్టా వేదిక విూదకు వచ్చింది.
బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న అనేక మిలిటెంట్ సంస్థలు వలసదారుల రూపంలో అక్రమంగా ప్రవేశించి ఇక్కడ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇందులో రోహింగ్యాల విషయంలో అనేక దారుణాలు వెలుగు చూశాయి. బర్మాలో వారు హిందువులను ఊచకోతలకు గురి చేశారు. హైదరాబాద్‌లో దొంగతనంగా ఆధార్ లాంటి కార్డులను పొందారు. సహజంగానే సాధారణ జనం మనసులో అవన్నీ భయాందోళనలు కలిగించాయి. జాబితా బాధితులు బెంగాలీలు కాబట్టి, మమతా బెనర్జీ వెంటనే రంగంలోకి దిగి మద్దతు కూడగట్టుకుంటున్నారు. అంతర్యుద్ధ ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఆమె ఆందోళనలో బెంగాలీవాదం కంటె, మైనారిటీల బుజ్జగింపే ఎక్కువగా ఉంది. అసోంలో ఏమి జరుగుతుందనే దానితో నిమిత్తం లేకుండా దేశమంతా ఇదొక పెద్ద చర్చగా మారుతుంది. అయితే అక్రమ వలసలు నిర్మూలించకపోతే దేశ ఉనికికే ప్రమాదంగా మారవచ్చు. ఇప్పటికే అనేకులు మిలింటెంట్ల ముసుగుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ దశ పోవాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.