వసతి గృహల్లో వసతులు కల్పించాలి అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌, జూలై 28 : మరో 3-4 వారాల పాటు వసతి గృహాలలో పర్యటించి, రాత్రి బస చేసి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం ఇవ్వాలని జిల్లా కలెక్టరు డి. వరప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో యంపిడిఒలు, మండల ప్రత్యేక అధికారులతో వారంతపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు కనీస సౌకర్యాలు, వసతి ఏర్పాటు చేయడానికి ఈ రాత్రి బసలు ఎంతైనా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ శుక్రవారం లాగే వచ్చే మరిన్ని శుక్రవారాల్లో అధికారులు వసతి గృహాల్లో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలను ఆకళింపు చేసుకోవాలన్నారు. ఈ ప్రయత్నం ద్వారా విద్యార్థులు వారి సమస్యలను చనువుతో అధికారులకు వివరిస్తారన్నారు. విద్యార్థుల నుండి సేకరించిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో అత్యవసరాలను తీర్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తలుపులు, విద్యుత్‌ వంటి తదితర సమస్యలు వెంటనే తీర్చాలన్నారు. విద్యార్థుల సంఖ్యను మంజూరి ప్రాతిపదికనే చేర్చుకోవాలి అదనంగా చేర్చుకుంటే అందరికి ఇబ్బందులు ఏర్పటడతాయన్నారు. విద్యుత్‌ సరఫరా లేని సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి రీచార్జీ లైట్లను అందించాలన్నారు. 50లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యంగా పెట్టుకొగా ఇప్పటికి 50శాతం మాత్రమే నాటరని మిగతాయి పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా ఎరువుల సరఫరాలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ విషయమై సంబంధిత విండోలకు, కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. ఇప్పటి పంటల సాగు సంతృప్తి కరంగానే ఉందని తెలిపారు. నోయా, మొక్కజొన్న పంటలు సాధారణ సాగు కంటే అధికంగానే సాగు చేశారన్నారు. ఇప్పటికీ ఋణాలు పొందని రైతులకు ఋణాలు అందించడానికి వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం సీజన్‌ ఉన్నందున అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నందున దీనిని ఎదుర్కొవడానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంతోపాటు పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు నిశిత పరిశీలన చేస్తు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అందరు అధికారులు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పనిచేసిన చోటనే నివాసం ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు హర్షవర్థన్‌, అదనపు జె.సి శ్రీరాం రెడ్డి, పి.డి.లు పీరాచారి, వెంకటేశం, రమేష్‌ సిపిఓ నబి, డిసిఓ శ్రీహరి, డిపిఓ సురేష్‌ బాబు, డిసిహెచ్‌ ఎస్‌ తులసిబాయి, ఆర్‌పియం/పిఓ గురుమూర్తి, స్టెవ్‌ సిఇఓ సాయిలు, కామారెడ్డి ఇన్‌చార్జి కమీషనర్‌ సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు