‘వస్తున్నా మీ కోసం’ రూట్‌ మ్యాప్‌ ఖరారు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు అయ్యింది. జిల్లాలోని జుక్కల్‌, బాన్స్‌వాడ, బోధన్‌ నియోజక వర్గాల్లోని 60 గ్రామాల్లో 8 రోజుల పాటు కొనసాగుతుంది.సుమారు 116.8 కిలోమీటర్ల పాటు పాదయాత్రకు జిల్లా టిడిపి నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.ఈనెల 28న మద్యాహ్నం జిల్లాలో ప్రవేశించే బాబు డిసెంబర్‌ 5వ తేది వరకు జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు. తొలిరోజు బుధవారం మెదక్‌ జిల్లాలో పాదయాత్రను ముగించుకొని నిజామాబాద్‌ జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్‌కు చేరకుంటారు. మొదటిరోజు తిమ్మానగర్‌ నుండి హుస్నాపూర్‌ క్రాస్‌రోడ్‌ ద్వారా పిట్లం చేరకొని అక్కడే బస చేస్తారు. మొదటిరోజు 3.8 కిలోమీటర్లు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుంది. రెండోరోజు 16.4,మూడోరోజు 16.6, నాలుగోరోజు 17.4, ఐదవ రోజు 13.5, ఆరో రోజు 18.9,  ఏడవ రోజు 15.1, చివరి రోజు 15.1 కిలో మీటర్లు నడవనున్నారు.చివరిరోజు నవీపేట మండలం యంచ గ్రామం వద్ద జిల్లాలో బాబు పర్యటన ముగుస్తుంది.అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా బాసర పుణ్యక్షేత్రం గోదావరి బ్రిడ్జివద్ద ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాలోని మండలాల్లో మండల సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేసారు.